HMDA | సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ) : ‘పార్కింగ్ దందా, కారుకు వంద… ఇదేం దందా’ పేరిట ట్యాంక్ బండ్పై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పార్కింగ్ అవకతవకలపై ‘నమస్తే’లో వచ్చిన కథనాలపై హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. చేతివాటం ప్రదర్శించిన బీపీపీ ఇద్దరు అధికారుల ఆగడాలకు చెక్ పెట్టేలా తాజాగా టెండర్ నోటీసులు జారీ చేశారు.
మూడేండ్ల కాలం పాటు పార్కింగ్ స్టాండ్ నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేయగా, ఎన్టీఆర్ ఘాట్, సంజీవయ్య పార్క్, అంబేద్కర్ విగ్రహం పక్కన, సంజీవయ్య పార్క్ వద్ద ఒక ఎకరం విస్తీర్ణంలో పార్టీలు, అమ్యూజ్మెంట్, కన్వెన్షన్, ఈవెంట్ సౌకర్యాల స్థాపన, నిర్వహణకు అవసరమైన టెండర్లకు సంబంధించి అర్హత కలిగిన వారు ఈ నెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినా, పార్కింగ్ అక్రమ వసూళ్లపై బీపీపీ అధికారులపై కమిషనర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉన్నతాధికారులకు తెలియకుండానే, హెచ్ఎండీఏ కమిషనర్ పేరిట ఆదేశాలు ఉన్నాయంటూ బుకాయించి అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలకు ఇప్పటికే సంబంధిత అధికారులు తెర లేపినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ప్రత్యేక దృష్టి పెడితే తప్ప.. సాధ్యం కాదు. లేదంటే ఎంసీ పేరిట అయినవాళ్లకు టెండర్లను కట్టబెట్టేలా ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ మాటున ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఇన్నాళ్లు టెండర్లు జరగకుండా నిలిపిన బీపీపీ అధికారుల పాత్రపై విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.