కార్వాన్, డిసెంబర్ 7: అవినీతి ఆరోపణలతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుల్సుంపురా ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ వ్యవహారంపై ‘నమస్తే’లో గత నవంబర్ 28న ‘ఓల్డ్ సిటీ సీఐ వసూళ్ల దందా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఓ బరాత్‌లో ఆయుధాలు ప్రదర్శించిన కేసులో అసలు నిందితులను తప్పించి వేరే వ్యక్తులను ఈ కేసులో ఇరికించిన ఇన్స్పెక్టర్ సునీల్.. ఇందుకు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కుల్సుంపురా ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా మంగళహాట్ డీఐ మహేశ్వర్‌ను నియమించగా, ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు.