బల్దియా వార్డుల పునర్విభజన, విలీన ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. వార్డుల విభజన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంటూ దాఖలైన సుమారు 80 లంచ్ మోషన్ పిటిషన్లను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారించారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినందున ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, 24 గంటల్లోగా అన్ని వార్డుల జనాభా, వాటి మ్యాప్‌లను పబ్లిక్ డొమైన్లో ఉంచాలన్న ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సవరించిన విషయాన్ని గుర్తుచేశారు.
రెండు వార్డులపై పిటిషన్లు వేసిన రెండు పిటిషన్లకే ఆ ఉత్తర్వులను పరిమితం చేసిందన్నారు. వార్డుల విభజన, విలీనం వంటి వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని కోరారు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగంలోని 243జెడ్జీ అధికరణం అనుమతించడం లేదన్నారు. ఐదు వేలకుపైగా అభ్యంతరాలు అందాయని, వాటిని పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం వారంలోగా అభ్యంతరాలు చెప్పాల్సి ఉండగా చెప్పకుండా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం చెల్లదన్నారు.
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కోర్టుల జోక్యానికి వీలుంటుందని చెప్పారు. వారంలోగా అభ్యంతరాలు సమర్పించాలన్న నిబంధనను అమలు చేయాలని చట్టంలో లేదన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం, వారంలోగా సమర్పించిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున తమ ముందున్న పిటిషన్లల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.