హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 ఏండ్లుగా నడుస్తున్న న్యాయ వివాదం గురువారం హైకోర్టుకు చేరింది. హుస్సేన్ సాగర్ సరస్సులో పూడికతీత పనుల కోసం భారత డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)కు హెచ్ఎండీఏ మధ్య ఒప్పందం జరిగింది. భారీ యంత్రాలు పనిచేయని కాలానికి కూడా డబ్బు చెల్లించాలని డీసీఐ కోరడాన్ని హెచ్ఎండీఏ తప్పుపడుతూ.. న్యాయపోరాటం చేస్తున్నది. ఇరుపక్షాలు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. పనిలేకుండా యంత్రాలను ఖాళీగా ఉంచిన కాలానికి డీసీఐకి చార్జీలు చెల్లించాలని ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చింది. దీనిని హెచ్ఎండీఏ సవాల్ చేయగా.. ఆర్బిట్రేషన్ అవార్డును సమర్థిస్తూ.. సిటీ సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు గురువారం విచారణకు వచ్చింది. అప్పీల్ చేయడంలో 371 రోజులు జాప్యం అయిందని, దీనికి మినహాయింపు ఇచ్చి పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని హెచ్ఎండీఏ న్యాయవాది వై. రామరావు కోరారు. డీసీఐకి నోటీసులు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.