సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీ నేతలు కాసుల వేటలో నిమగ్నమయ్యారు. భూములు… టెండర్లు… ఇలా ఒకటేమిటి! ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా భూతద్దం పెట్టి మరీ ధనార్జన సాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అమల్లోకి తెచ్చిన నిబంధనలు… హైకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగు ప్రకటనలపై ఇప్పుడు నజర్ పడింది. చూసేందుకు సాధారణ వాణిజ్య ప్రకటనలే కదా… అన్నట్లుగా ఉండే ఈ రంగంలో ఏటా వందల కోట్ల టర్నోవర్ ఉంటుందనేది అంచనా. ఈ నేపథ్యంలో కొత్తగా మెట్రో రైలు స్టేషన్ల వద్ద హోర్డింగుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
తెర మీద ఒక కంపెనీని ఉంచి… తెర వెనక ‘ముఖ్య’నేత సోదరుడితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన మైనార్టీ నేత ఒకరు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. వీరితో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులకూ ఇందులో వాటా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు గతంలో జారీ చేసిన జీవో 68తో పాటు హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ హోర్డింగుల ఏర్పాటు ప్రక్రియను భుజాన వేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ నగరంలో వాణిజ్య ప్రకటనల రంగం అనేది కోట్లాది రూపాయల టర్నోవర్‌తో కూడుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడపడితే అక్కడ పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ప్రైవేటు భవనాలకు తోడు రహదారుల పక్కన కూడా భారీ హోర్డింగులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతకాలం అవి కొనసాగాయి. అయితే ఈ సమయంలో గాలి దుమారం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అవి కూలిపోయి కొందరు ప్రాణాలు కూడా పోయాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి హోర్డింగుల ఏర్పాటుపై కఠినంగా వ్యవహరించింది.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా అడ్వర్టైజ్మెంట్ పాలసీల్లో మార్గదర్శకాలు రూపొందించి… 2020లో జీవో 68 జారీ చేసింది. ఈ మేరకు నగరంలో హోర్డింగులు 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న హోర్డింగులు, వివిధ రకాల ప్రకటనల యూనిపోల్స్, నియాన్/గ్లోసన్ బోర్డులు, లాలీపాప్స్ వంటి వాటిని నిషేధించారు. దీంతో పాటు ప్రకటన బోర్డుల గరిష్ఠ పరిమాణాలను సైతం అందులో పొందుపరిచారు. తద్వారా నగరంలో హోర్డింగులు, ప్రకటనల బోర్డుల ద్వారా జరిగే ప్రమాదాలను నివారించినట్లయింది. ఇదే కాకుండా వాణిజ్య ప్రకటనలకు సంబంధించి గతంలో హైకోర్టు ఉత్తర్వులు కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రధానంగా ఎల్ఈడీ ప్రకటనలపై నిషేధం విధించిన కోర్టు… ఒకవేళ ఏర్పాటు చేసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
అన్నింటినీ బేఖాతరు చేస్తూ టెండర్లు…
ఒకవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 68… మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు… వీటినీ ఖాతరు చేయకుండా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) హోర్డింగుల ఏర్పాటుపై ముందుకుపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. మెట్రో స్టేషన్ల వద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 20, నాగోల్-రాయదుర్గం మార్గంలో మరో 20 ఎల్ఈడీ ప్రకటనల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలోనే టెండర్లు పిలిచింది. ఆ తర్వాత పలు సవరణల కోసం ఏకంగా ఐదు పర్యాయాలు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించినట్లు తెలిసింది. కాగా, ఈ టెండర్లలో హెచ్ఎంఆర్ఎల్ రెండు కీలకమైన ఉల్లంఘనలకు పాల్పడటంపై ఆరోపణలకు తావిస్తున్నది.
జీవో 68 ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రకటనల బోర్డులు ఉండొద్దు. కానీ హెచ్ఎంఆర్ఎల్ మెట్రో స్టేషన్ల వద్ద రెండు వైపులా ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. అంటే ఇవి మెట్రో స్టేషన్ ఉండే రహదారిపైన అమర్చుతారు. ఇవి జాతీయ రహదారులు కావడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిబంధనల ప్రకారం 20 అడుగుల ఎత్తు వరకు వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు. దీని ప్రకారం 20 అడుగుల ఎత్తుపైనే ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయాలన్నమాట. ఇక… టెండర్లలో బోర్డుల పరిమాణాన్ని కూడా పొందుపరిచారు.
ఈ బోర్డులు 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తులో ఉండాలని చెప్పారు. ఎన్హెచ్ఏఐ నిబంధనలు, బోర్డుల సైజును పరిగణలోనికి తీసుకుంటే బోర్డులు కనీసంగా 30 అడుగుల ఎత్తులో ఉంటాయనేది నిర్వివాదాంశం. ఎల్ఈడీ ప్రకటనలు అయినందున క్యాండీ లివర్స్ ఏర్పాటు చేస్తారని తెలిసింది. వీటి నిర్మాణ తీరు దృష్ట్యా బోర్డులు 32-35 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని తెలుస్తున్నది. జీవోకు విరుద్ధంగా ఇంత ఎత్తులో ప్రకటనలు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించడం వెనక మతలబు ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
పైగా జీవో 68లో కూడా ప్రకటనల బోర్డులు ఎరుపు, నీలి రంగుల్లో వెలుతురు వచ్చేలా ఉండి వాహనదారుల దృష్టిని భగ్నం చేసేలా… అత్యవసర లైటింగ్‌ను తలపించేలా ఉండొద్దని నిబంధన కూడా ఉంది. మరోవైపు నగరంలో ఎల్ఈడీ ప్రకటనలపై గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. నిషేధం ఉన్నప్పటికీ హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఈడీకి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎలా టెండర్లు పిలిచిందనేది కీలకమైన అంశం. ఎల్ఈడీ ప్రకటనలను రహదారులపై ఉంచడం వల్ల వాహనదారుల కండ్లపై ఫోకస్పడి ప్రమాదాలు జరిగే ప్రమాదముందనే నిపుణుల హెచ్చరికలు ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల కేబీఆర్ పార్కు దగ్గర నవ నిర్మాణ్ అనే సంస్థ మల్టీ లెవల్ పార్కింగ్ పేరిట ఎల్ఈడీ స్క్రీన్‌పై వాణిజ్య ప్రకటనలకు అవకాశం ఇచ్చింది. కాగా, హెచ్ఎంఆర్ఎల్ ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండానే హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించి మరీ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది.
నవ నిర్మాణ్కేనా టెండరు ఖరారు?
మెట్రో స్టేషన్ల వద్ద హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి అధికారులు నిర్వహించిన టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొనగా… ఒక కంపెనీని ఖరారు చేసినట్లుగా తెలిసింది. అయితే అది నవ నిర్మాణ్ అసోసియేట్స్ అనే ప్రచారం జరుగుతున్నది. రెండో కంపెనీ కూడా వీరికి సంబంధించినదే అనే ఆరోపణలున్నాయి. కేబీఆర్ పార్కు దగ్గర మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్టుతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో ఎల్ఈడీ ప్రకటనల ఏర్పాటు కూడా ఈ కంపెనీకే ఇచ్చారు. దీని వెనక ‘ముఖ్య’నేత సోదరుడితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన మైనార్టీ నేత ఒకరు ఉన్నట్లు తెలిసింది.
కాగా, నగరంలోని మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేస్తున్న దానిలో ఒక మంత్రితో పాటు పలువురు అధికార పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్ రెండు మార్గాల్లో 40 బోర్డులకు టెండర్లు పిలిచి, నవ నిర్మాణ్ అసోసియేట్స్‌కు టెండర్లు కట్టబెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ప్రక్రియ తర్వాత ఎల్ఈడీ ప్రకటనలకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మూడు మెట్రో మార్గాల్లోన్ని 57 స్టేషన్ల వద్ద రెండు చొప్పున బోర్డుల ఏర్పాటును అదే సంస్థకు అప్పగించే యోచన కూడా ఉన్నట్లు సమాచారం.
సహ చట్టాన్నీ లెక్క చేయని హెచ్ఎంఆర్ఎల్…
ఈ టెండరు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు హెచ్ఎంఆర్ఎల్ నిరాకరిస్తున్నట్లు తెలిసింది. ప్రైవేటు అసోసియేషన్ ఒకటి సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను కోరినప్పటికీ హెచ్ఎంఆర్ఎల్ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వారు అప్పిలేట్ అథారిటీకి వెళ్లినా ప్రయోజనం లేనట్లు తెలిసింది. దీంతో సదరు అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ‘నమస్తే తెలంగాణ’ కూడా వివరాలు తెలుసుకునేందుకు సంబంధించి జనరల్ మేనేజర్‌తో పాటు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.