సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారం వెనక ఏదో శక్తి దాగి ఉందని, వారే కొత్త సంక్షోభానికి కుట్ర పన్నుతున్నారని సీనియర్ న్యాయవాది పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యవహారంతో ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అది జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
అల్లు అర్జున్ అంశం తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడం రచ్చకు దారి తీసిందన్నారు. అల్లు అర్జున్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయని, పక్క రాష్ర్టాలు సైతం మద్దతునిస్తున్నాయన్నారు. కానీ బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది తెలంగాణ సమాజమేనన్నారు. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడినవారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. సినిమా రంగంలోని వలసవాదులతీరును ఖండించాలన్నారు.