Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, సూరారం, బేగంపేట, ఎస్సార్‌నగర్, బోయిన్పల్లి, కొంపల్లి, తార్నాక, హబ్సిగూడ, లాలాపేట, నాచారం, మల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, జవహర్‌నగర్‌లో దాదాపు 30 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.
రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.