సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): ‘ఆర్టీసీలో తాను విజిలెన్స్ ఆఫీసర్ బుకాయిస్తాడు. ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారి ఫొటోలు తీస్తాడు. ఉన్నతాధికారులకు పంపాలా.. లేక డబ్బులు ఇస్తారా..?’ అంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ప్రబుద్ధుడి బండారాన్ని ఈస్ట్‌జోన్ పోలీసులు బయటపెట్టారు. సోమవారం డీసీపీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి నిందితుడి అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్‌కు చెందిన కె.సుధీర్ అనే వ్యక్తి మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి నిరుద్యోగిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంతంలో ఉండేవారు.
ఆ సమయంలో డ్రైవర్లు, కండక్టర్లతో విరివిగా మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ ప్రక్రియకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు నెట్, టోల్‌ఫ్రీ నెంబర్ల ద్వారా ఆర్టీసీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. ఇదే క్రమంలో కొందరు కండక్టర్లు దూర ప్రయాణాలు చేసేటప్పుడు విధుల్లో నిర్లక్ష్యం వహించడం గమనించి అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించేవాడు. ఆ తర్వాత తాను ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్నని చెప్పి వారి వీడియోలు చూపించి టీజీస్టేట్ ఆర్టీసీ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ ప్రస్తుత ఎండీ నాగిరెడ్డి, గత ఎండీ సజ్జనార్ ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకుని తనకు వారితో సంబంధాలున్నాయని, వారితో మాట్లాడినట్లుగా చేసి ఉద్యోగులను బెదిరించేవాడని డీసీపీ తెలిపారు. తాను తీసిన ఫొటోలు ఉన్నతాధికారులకు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఉద్యోగులను బెదిరించడంతో వారు డబ్బులు ఇచ్చేవారని బాలస్వామి పేర్కొన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో సుధీర్‌పై 13 కేసులు ఉన్నాయని, ఇందులో రెండు నాన్‌బెయిలబుల్ కేసులని, అతను గతంలో అరస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు బాలస్వామి తెలిపారు.
గతంలో సుధీర్ ఒక సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ అమాయకులను రూ.3కోట్లకు మోసం చేసినట్లు పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్‌నంటూ ఆర్టీసీ ఉద్యోగులను బెదిరించిన విషయం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు పక్కా ప్రణాళికతో అతనిని అరెస్ట్ చేశారని బాలస్వామి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, కాచిగూడ ఏసీపీ హరీశ్‌కుమార్, కాచిగూడ ఇన్స్పెక్టర్ టి.జ్యోత్స్న, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మల్లేశం, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.