‘అతడి పేరు ప్రమోద్. ర్యాష్ డ్రైవింగ్‌లో పోలీసుల నిఘా నేత్రానికి మూడు సార్లు చిక్కాడు. మరో చోట డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. వాహన నంబర్ తనిఖీ చేయగా ర్యాష్ డ్రైవింగ్ చిట్ట బయటపడింది. ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా ఎగ్గొట్టాడు. నిర్లక్ష్య డ్రైవింగ్‌గా భావించిన పోలీసులు లైసెన్స్ రద్దుకు ఆర్టీఏకు సిఫారసు చేశారు. పరిశీలించిన అధికారులు వాహనదారుడికి నోటీసులిచ్చి చివరికి అతడి లైసెన్స్ రద్దు చేశారు.’
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ ): రోడ్డు నిబంధనలు పాటించకుండా బండి నడిపిన వారిపై వేటు పడుతున్నది. రవాణాశాఖ అధికారులు ఈ మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి పోలీసుల నుంచి వస్తున్న లైసెన్స్ రద్దు ప్రక్రియపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రేటర్లో అత్యధికంగా రోడ్డు నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ప్రమాదకర డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా తయారవుతున్నారు.
అందులో భాగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నవారి పై వేగంగా చర్యలు తీసుకోవాలని లైసెన్స్ ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ ఏడాది ఆరు నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 2091 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయి. గ్రేటర్‌లోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి లైసెన్స్‌ల రద్దు కోరుతూ వచ్చిన అనేక సిఫారసులను ఆర్టీఏ అధికారుల వద్ద పరిశీలనకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరలో సుమారు 19,271 లైసెన్స్‌లు రద్దు అయినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
జర పైలం..!!
నిబంధనల ప్రకారం తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుపడితే 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తున్నారు. రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేయనున్నారు. అంతేకాదు మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే వీలు ఉంది. అతివేగం, ఓవర్‌లోడ్, మరణాలకు కారణమయ్యే యాక్సిడెంట్లు చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తదితర వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది.
పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. పది రోజుల్లో అతడు తన వివరణను ఇస్తాడు. అనంతరం రవాణ శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది. కోర్టు నిబంధనల ప్రకారం వాహనదారుడికి నోటీసులు పంపకుండా లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాదు అని.. అందులో భాగంగానే కొంత ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పారు.