Balaji Naidu | ఖైరతాబాద్, నవంబర్ 18: దేశంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పట్టా పొందాడు. జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓఎల్ఎక్స్ వేదికగా నేరాలకు పాల్పడ్డాడు. గత ఆరేండ్లుగా పోలీసుల కంట్లో పడకుండా తప్పించుకొని తిరుగుతున్న ఈ అంతర్రాష్ట్ర మోసగాడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ శోభన్, డీఐ శ్రావణ్ కుమార్ కలిసి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని భవానీనగర్‌కు చెందిన ఎం.బాలాజీ నాయుడు అలియాస్ బాలాజీ (35) ఓ ప్రముఖ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ పట్టాను పొందాడు. డబ్బులు సంపాదించేందుకు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకు ఓఎల్‌ఎక్స్‌ను ఉపయోగించుకున్నాడు.
ఎవరైనా ఖరీదైన ఫోన్లను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో పెడితే.. విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు దారుడిని అడ్డంగా మోసగించి డబ్బులు తన ఖాతాలోకి వేసుకుంటాడు. ఎవరైనా ఓఎల్ఎక్స్లో సెల్‌ఫోన్‌ను అమ్మకానికి పెడితే తాను కొనుగోలు చేస్తానని చెబుతాడు. సంప్రదింపులు చేసి ఫోన్‌తో పాటు దానికి సంబంధించిన పత్రాలను కాపీ చేసుకుంటాడు. తాను ఎలాగైనా కొంటున్నాను కదా.. ఓఎల్ఎక్స్లో నుంచి డిలీట్ చేయమని చెబుతాడు. విక్రయదారు డిలీట్ చేయగానే ఆ ఫోన్ల వివరాలను తన నంబర్ ద్వారా ఓఎల్ఎక్స్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్టు వివరాలు పెడుతాడు. ఎవరైనా ఆ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే ఫలానా చోట కలువాలని, తన సోదరుడు వచ్చి ఆ ఫోన్‌ను చూపిస్తాడని, అక్కడ ఫోన్ తీసుకొని డబ్బులు మాత్రం తన అకౌంట్‌కు బదిలీ చేయాలని చెబుతాడు. అలా తన ఖాతాలో డబ్బులు పడగానే ఉడాయిస్తాడు. 2018 నుంచి ఇప్పటి వరకు 200 మందిని మోసం చేసి లక్షలాది రూపాయలు దండుకున్నాడని ఏసీపీ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. బెంగళూరు, తిరుపతి, విజయవాడలో అరెస్టు అయ్యాడని, అతడిపై పంజాగుట్ట, మధురానగర్ పీఎస్ పరిధిలో మూడేసి చొప్పున కేసులు ఉన్నాయన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టలో 23 సిమ్‌కార్డులను వినియోగించాడని, 138 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, వెలుగులోకి రాని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ఏసీపీ చెప్పారు. మోసాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్లైన్ గేమ్స్‌లో పెట్టుబడిగా పెట్టి వాటిని పోగొట్టుకోవడం, సొమ్ము రాగానే జల్సాలు చేయడం అతడి ప్రవృత్తి అని తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సైలు శివశంకర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.