సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): జలమండలిలో మురుగును తొలగించేందుకు జెట్టింగ్ యంత్రాలను సమకూర్చేందుకు నిర్వహించే టెండర్ల వ్యవహారంలో ఓ సూపరింటెండెంట్ కేటగిరీ ఉద్యోగి గుత్తాధిపత్యం చెలాయిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జెట్టింగ్ మిషన్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించే సర్కిల్-2లో తిష్టవేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. ఏండ్ల తరబడిగా టెండర్ల విధివిధానాలను పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండటం వల్ల ఉన్నతాధికారులు కూడా ఆ ఉద్యోగి చెప్పిందే వేదంలా భావిస్తున్నారు. దీంతో టెండర్ల ప్రక్రియలో జరిగే గోల్మాల్ ఈడీ, ఎండీ స్థాయి దాకా వెళ్లడం లేదనే చర్చ జరుగుతున్నది.
ఇదే అదనుగా ఆ సూపరింటెంటెండ్ బంధువులు, కొందరు అనుకూల కాంట్రాక్టర్లకే జెట్టింగ్ యంత్రాల టెండర్ దక్కేలా చక్రం తిప్పుతున్నారు. కాగా, జలమండలిలో టెండర్ల ప్రక్రియను కొన్నేండ్లుగా ఎస్ఆర్నగర్లోని సర్కిల్-2 ద్వారా నిర్వహిస్తున్నారు. అంతకు ముందు గోషామహల్‌లోని సర్కిల్-3 కార్యాలయంలో చేపట్టేవారు. అక్కడే చిరుద్యోగిగా పని చేస్తున్న సదరు ఉద్యోగి టెండర్ల ప్రకియలో నియమ నిబంధనలు, మెళకువలను అవపోశన పట్టించుకున్నారు. ఈ క్రమంలో టెండర్ల ప్రకియ సర్కిల్-2కి మార్చడంతో అక్కడికి బదిలీ చేయించుకున్నారు. కొనేండ్లకు సర్కిల్-4కు పదోన్నతితో బదిలీ అయినా.. సర్కిల్-2 నుంచే ఆన్‌డ్యూటీ కింద విధులు నిర్వర్తిస్తూ టెండర్ల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలుస్తున్నది. పదేండ్లుగా టెండర్ల ప్రక్రియలో ఏక చక్రాధిపత్యం వహిస్తూ రాజ్యమేలుతున్నారు.

Getting