e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home హైదరాబాద్‌ మంచోళ్లా.. ముంచేటోళ్లా?

మంచోళ్లా.. ముంచేటోళ్లా?

  • పనిమనుషులు, డ్రైవర్లను పెట్టుకునేముందు జాగ్రత్త
  • వారి గత చరిత్ర తెలుసుకోవడం ప్రధానం
  • ‘హాక్‌ ఐ’ యాప్‌ ద్వారా పోలీసుల ఉచిత సర్వే
  • వెరిఫికేషన్‌ తర్వాతే పనిలో పెట్టుకోవడం మేలు

ఇంట్లో పనిమనుషులు, డ్రైవర్లను పెట్టుకునేముందు తస్మాత్‌ జాగ్రత్త. వారి గురించి పూర్తిగా తెల్వకుండా, వ్యక్తిగత సమాచారం లేకుండా నియమించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్‌ ఫోన్‌లో ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వారి వివరాలు నమోదు చేస్తే పోలీసులు వెరిఫికేషన్‌ చేసి వివరాలను యజమానులకుఅందజేస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమే.

హాక్‌ ఐలోరిజిస్ట్రేషన్‌ ఇలా..

  • హాక్‌ ఐ ద్వారా మీ వద్ద పనిచేసే వారి గత చరిత్ర తెలుసుకోవాలంటే ప్లేస్టోర్‌లోకి వెళ్లి అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • తర్వాత పోలీస్‌ విత్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • సర్వెంట్స్‌, డ్రైవర్‌, తోటమాలి, అటెండర్‌, వాచ్‌మన్‌, విదేశాలకు సంబంధించిన పనిమనుషులు, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌, కిరాయిదారులకు సంబంధించి ఆ వివరాలు నమోదు చేయాలి.
  • ఎవరి గురించి వెరిఫికేషన్‌ కావాలో వారికి సంబంధించి ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి.
  • వివరాలు నమోదు చేసుకొని ఐటీ సెల్‌, పనిలోకి వచ్చే వ్యక్తులు ఎక్కడుంటారో, ఆ ప్రాంత పోలీసులకు ఆ వివరాలు పంపించి వాళ్లపై ఏమైనా కేసులున్నాయా? ఎలాంటి వాళ్లు అనే విషయాన్ని ఆరాతీసి, నివేదిక అందిస్తారు.

మీరు కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా.. ? జర జాగ్రత్త.. వారు ఎవరో ఎలాంటి వాళ్లో ముందుగా తెలుసుకోవడం మంచిదంటున్నారు పోలీసులు. వారెంత నిజాయతీగా పనిచేసినా సరే.. వారికి క్రిమినల్‌ రికార్డు లేవని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని చోరీ ఘటనలు యజమానులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసింది. పనిమనుషులుగా నియమించుకునే ముందు వారి గత చరిత్రను యజమానులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక సంఘటన జరిగిన తరువాత బాధపడటం కంటే, ముందే తెలివిగా వ్యవహరిస్తే.. నేరస్తుల ఆటకట్టించవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. మొబైల్‌లో ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. తద్వారా మీకు ఉచితంగా సర్వెంట్‌ బ్యాగ్రౌండ్‌ వెరిఫికేషన్‌ లభిస్తుంది. ఈ సేవలు పోలీసులు ఉచితంగానే అందిస్తున్నారు. మీ బస్తీలు, కాలనీలలో విధులు నిర్వహించే పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ పోలీసుల నుంచైనా ఈ సేవలు పొందవచ్చు.

మీ కోసమే ‘హాక్‌ ఐ’

- Advertisement -

మన వద్ద పనిచేసే వారు ఎలాంటి వారో తెలుసుకున్న తరువాతే ఉద్యోగంలో పెట్టుకోవాలి. అందుకు హాక్‌ఐ ద్వారా పోలీసు శాఖ నుంచి ఉచితంగా అందిస్తున్న సేవలను వాడుకోవాలి. మూడేండ్లలో 38 మంది నేపాలీలు క్రైమ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. అందులో ఆటోమొబైల్‌, తాళాలు పగలగొట్టి దొంగతనాలు, దోపిడీలు చేసేవారు ఉన్నారు. ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలకు మనం వెళ్లడం, అక్కడున్న వారు ఇక్కడకు వచ్చి పనులు చేసుకోవడం సాధారణం. అందరినీ ఒకే దృష్టిలో చూడలేం, కొత్త వ్యక్తులు మన వద్ద పనిలోకి వస్తున్నారంటే వాళ్లు ఎలాంటి వారోననే విషయం యజమానిగా తప్పక తెలుసుకోవడం మంచిది. – సీపీ అంజనీకుమార్‌

‘హాక్‌ ఐ’తో వెరిఫికేషన్‌ చేయించండి

చింతలబస్తీకి చెందిన మనోజ్‌ అగర్వాల్‌ కుటుంబం వద్ద ఇద్దరు నేపాలీ దంపతులు పనిలో కుదిరారు, నెల రోజులు పనిచేసి, అదును చూసి ఇంటి యజమానిని తాళ్లతో కట్టేసి రూ. 85 లక్షల సొత్తుతో ఉడాయించారు. ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండాలంటే తమ వద్ద పనిచేస్తున్న వారి బ్యాగ్రౌండ్‌ ఏంటీ, నేర చరిత్ర ఉందా? ఎలాంటి వ్యక్తులు అనే సమాచారం తెలిసి ఉండాలి. ‘హాక్‌ ఐ’ ద్వారా పోలీసులు పనిలో చేరిన వారి బ్యాగ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేసి ఉచితంగా ఆయా యజమానులకు అందిస్తారు.

నేపాల్‌ అంటే అనుమానించండి..

ఎంతో అమాయకత్వం….కష్ట పడి చేస్తామన్న బిల్డప్‌….చనువుగా ప్రవర్తించడం….కుటుంబంలో కలిసి పోవడం….ఇది నేపాలీ గ్యాంగ్‌ చోరకళ. చింతలబస్తీలో శనివారం తెల్లవారుజామున ఐదుగురు సభ్యులతో కూడిన నేపాలీ గ్యాంగ్‌ టెక్స్‌టైల్‌ వ్యాపారి యజ్ఞ అగర్వాల్‌ ఇంట్లో వృద్ధ దంపతులను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి రాడ్లతో బెదిరించి సుమారు రూ.40లక్షల విలువైన బంగారం, మరో రూ.40లక్షల విలువైన వజ్రాభరణాలు, రూ.5లక్షల నగదును తస్కరించిన విషయం తెలిసిందే.

వీరింట్లో దొంగతనానికి పాల్పడిన బీపేశ్‌ (23) అనిత శశి అలియాస్‌ నిఖిత (21)లు 15 రోజుల కిందట పనికోసం వచ్చారు. తాము నేపాల్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చామని, పని కల్పించాలని బతిమిలాడారు. దీంతో వారిని వాచ్‌మెన్‌ పనికి పెట్టుకున్నారు. నమ్మకంగా నటిస్తూ ఇంట్లో పనుల్లో సహాయం అందిస్తూ చివరకు ఆ ఇంటికే కన్నం వేసి పరారయ్యారు. ఎవరైనా నేపాల్‌ నుంచి వచ్చామని, పని కల్పించాలని కోరితే వెంటనే వారి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు పోలీసులకు సమాచారం అందించాలని సైఫాబాద్‌ డీఐ రాజు నాయక్‌ తెలిపారు.

ఆరు బృందాలు ఏర్పాటు..

చింతలబస్తీ చోరీ కేసును సీరియస్‌గా తీసుకున్న సైఫాబాద్‌ పోలీసులు.. నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. చోరీలో ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరిలో ఇద్దరు దంపతులు అని చెబుతుండగా, మిగతా వారు వారి బంధువులుగా భావిస్తున్నారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా బయట రాష్ర్టాలకు కొన్ని టీమ్‌లు వెళ్లినట్లు ఏసీపీ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. సీసీ ఫుటేజీలు పరిశీలనలో నాలుగు బృందాలు, రెండు ఐటీ అనాలసిస్‌ బృందాలు ఈ దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే సీసీ ఫుటేజీల్లో నేపాలీ దొంగల గమనాన్ని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement