“సడుగులెంట, మడులెంట, ఖాళీ, సర్కారు స్థలాలెంట నాటిన మొక్కలు మహా వృక్షాలవ్వాలి. హరితహారంతో ఊళ్లన్నీ వనాలవ్వాలి. ఆహ్లాదకర వాతావరణంతో పల్లెలు కళకళలాడాలి. ప్రజలను పచ్చందాలు మురిపించాలి. బాటసారులు, రైతులు సేద తీరేందుకు వృక్షాలు నీడనివ్వాలి. పిల్లలు, మహిళలకు అందమైన పూలనివ్వాలి. వానరాలు తినేందుకు కాయలు, పండ్లనివ్వాలి. పక్షులు, పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు ఆశ్రయం ఇవ్వాలి. కాలుష్యాన్ని తరిమికొట్టి మానవాళికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే గాలినివ్వాలి. మన తరం ముందు తరాలకు చెప్పుకునేలా ఊళ్లు, పట్టణాల్లో పచ్చదనం పరిఢవిల్లాలి..” అనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడుతలు విజయవంతంగా పూర్తవగా, జూలై మొదటి వారంలో తొమ్మిదో విడుత అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం మహేశ్వరం మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాచరణ చేపట్టారు. మండల వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 31 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3,400 మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు.
మహేశ్వరం, జూన్ 28 : ‘తెలంగాణ పచ్చని వనం కావాలి.. ప్రతి ఊరిలో హరితదనం నిండాలి.. ప్రతి ఇల్లు మొక్కల పొదరిల్లు కావాలి’ అనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా తొమ్మిదో విడుత మహేశ్వరం మండలంలో మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. మండల వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై మొదటి వారంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్నది. మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి.
ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కల నిర్వహణకు పంచాయతీ కార్యదర్శిలు, సర్పంచ్లు నర్సరీ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ర్టాలకు పట్టుకొమ్మలుగా ఉండే పల్లెల్లో పెద్ద ఎత్తున హరితహారంలో మొక్కలు నాటేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఏ గ్రామ పంచాయతీకి కావాల్సిన మొక్కలు అక్కడే తయారు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో 3,400 మొక్కలు నాటే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని అధికారులు అంటున్నారు. తొలకరి పలుకరించిన నేపథ్యంలో తొమ్మిదో విడుతనూ విజయవంతం చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇక తేదీ ప్రకటించడమే తరువాయి..!
ప్రతి ఊర్లో 3,400 మొక్కలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు తుమ్ములూరు గ్రామ పంచాయతీలో 3,400 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాం. గ్రామ నర్సరీలో పంచాయతీ సిబ్బందితో మొక్కల సంరక్షణ చేపట్టి నాటేందుకు సిద్ధం చేశాం. మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నాం. మా గ్రామ పంచాయతీ నర్సరీలో వేప, చింద, కానుగు, పూల మొక్కలతో సహా ఇలా అన్ని రకాల మొక్కలను సంరక్షించడం జరిగింది.
– మద్ది సురేఖాకరుణాకర్రెడ్డి, తుమ్ములూరు గ్రామ సర్పంచ్
మండలంలో లక్ష మొక్కలు
మండలంలోని అన్ని గ్రామాల్లో హరితహారం మొక్కల నిర్వహణ చేపటాం. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నాం.. అన్ని గ్రామ పంచాయతీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఊర్లో 3,400 మొక్కలతో.. మండలంలో లక్ష మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నాం. నర్సరీల్లో మొక్కల పెంపకంలో కార్యదర్శులకు, సర్పంచ్లకు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం.
– నర్సింహులు, ఎంపీడీవో మహేశ్వరం