సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తనను చాలా మంది మోసం చేశారని, తనకు సహాయం చేస్తే మీ రుణం ఎప్పుడూ మరిచిపోలేనంటూ మాటలు చెప్పి ఎన్ఆర్ఐకి సంబంధించిన ఆస్థిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. హరీందర్‌రెడ్డి ప్రవాస భారతీయుడు. 1998 నుంచి అమెరికాలో ఉంటున్నాడు. 2009లో అతడు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో ఇతరుల ద్వారా రామకృష్ణరాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేస్తానని, అయితే అందరిని నమ్మడం వల్ల నన్ను చాలా మంది మోసం చేశారంటూ చెప్పాడు.
రాజు చెప్పిన మాటలను హరీందర్‌రెడ్డి నమ్మాడు. దీంతో రాజు అవసరాల కోసం హరీందర్ డబ్బులు ఇవ్వడంతో రూ.19 లక్షల అప్పులను తీర్చాడు. తన వ్యాపార అభివృద్ధికి డబ్బు కావాలని రాజు తరచూ హరీందర్‌ను అడుగుతుండటంతో.. తనకు వరంగల్‌లో రూ. 12 కోట్ల విలువైన స్థలం ఉందని హరీందర్ చెప్పాడు. దానిపై రుణం తీసుకొని తాను వాయిదాలు చెల్లిస్తానంటూ రాజు చెప్పడంతో ముందుగా హరీందర్‌రెడ్డి కోటి రూపాయల రుణం కోసం డాక్యుమెంట్లపై సంతకాలు చేశాడు. కోటి రూపాయలు రుణం పొందిన రాజు తిరిగి చెల్లించకపోవడంతో హరీందర్‌రెడ్డి నిలదీశాడు.
తనను సురేందర్ అనే వ్యక్తి మోసం చేశాడని నమ్మించాడు. శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు తనకు వ్యాపారంలో సహాయం చేస్తున్నారని నమ్మించాడు. అందరం కలిసి రుణం తీసుకొని వ్యాపారం నిర్వహిస్తామంటూ నమ్మించారు. 2016లో భువనేశ్వర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 25 కోట్ల రుణం మంజూరు చేయించారు. అందులో రూ. 6 కోట్లు వారి ఖాతాల్లో డిపాజిట్ కాగా.. మిగతావి ఆపేశారు. ఆ డబ్బు తీసుకున్న తరువాత వాయిదాలు చెల్లించకపోవడంతో హరీందర్‌కు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. తనను పక్కా ప్లాన్‌తో మోసం చేస్తున్నారని హరీందర్ గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.