Naveen Murder Case | సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): క్రైమ్ సీన్లు చూసి.. స్ఫూర్తిగా తీసుకొని నేరం చేసిన తరువాత సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడం ఎలా? ఈ మధ్య కాలంలో కొందరు నేరస్తులు అవలంభిస్తున్న తీరిది.ప్రేమిస్తున్న యువతి తనకు దూరమవుతుందనే కోపంతో తన స్నేహితుడైన నవీన్‌ను అత్యంత కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేసిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం మేరకు… ఈ కేసులో నిందితుడు హరిహరను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కోర్టు అనుమతితో 7రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండో రోజు సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నిందితుడిని విచారించారు. యూట్యూబ్‌లో క్రైమ్ సీన్లు చూసి హరిహర కృష్ణ తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
నవీన్ హత్య కేసులో లోతైన దర్యాప్తు జరుగుతుంది. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కస్టడీలో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. ఓ ఉన్నతాధికారి పర్యవేక్షణలో కేసు విచారణ సాగుతుంది. కేసు విచారణ దశలో ఉండగా వివరాలు వెల్లడించలేం. ఇది మానవులు చేసే పని కాదు, నిందితుడికి పక్కాగా శిక్షపడేలా అన్ని ఆధారాలను సేకరిస్తున్నాం. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం. ఇప్పటి వరకు అమ్మాయి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణ పూర్తయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తాం. అప్పటి వరకు మీడియా సంయమనం పాటించాలి.