Naveen Murder Case | సిటీబ్యూరో/పెద్దఅంబర్‌పేట్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : తాను ప్రేమించే అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే అనుమానంతోనే స్నేహితుడిని పక్కా ప్రణాళికతో కిరాతకంగా హతమార్చిన ఇంజినీరింగ్ విద్యార్థి హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ నాల్గవ సంవత్సరం చదువుతున్న నవీన్‌కు అతడు ప్రేమించిన యువతికి మధ్య విబేధాలు తలెత్తడంతో, దాన్ని ఆసరాగా చేసుకున్న హరిహరకృష్ణ తన పాత స్నేహితురాలైన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.
హరిహరకృష్ణ ప్రేమను ఆ యువతి అంగీకరించింది. దీంతో నవీన్ మళ్లీ మా మధ్యలోకి వస్తాడని, అతన్ని ఎలాగైనా అంతమొందించాలని హరిహర కృష్ణ మూడు నెలల కిందటే పథకం వేశాడు. రెండు నెలల కిందట మలక్‌పేట్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. ఈ నెల 17వ తేదీన నల్గొండ నుంచి నవీన్‌ను పిలిపించిన హరిహరకృష్ణ రాత్రి వరకు కలిసి తిరిగారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్ నల్గొండకు వెళ్లిపోవాలనుకునే ప్రయత్నంలో ఇద్దరు కలిసి దిల్సుఖ్నగర్ నుంచి ఓఆర్‌ఆర్‌వైపు వెళ్తూ, పెద్దఅంబర్‌పేట్‌లో మద్యం సేవించారు.
అనంతరం 11 గంటల ప్రాంతంలో నవీన్‌ను వదిలిపెట్టేందుకు ఓఆర్ఆర్ వద్దకు వెళ్లి, ఆలస్యమైందని తిరిగి వెళ్లిపోదామని వచ్చారు.ఆ సమయంలో హరిహరకృష్ణ ప్రేమించిన యువతితో మాట్లాడి నవీన్ గురించి ఆరా తీశాడు. ఇదే అదునైన సమయంగా భావించి, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రాంతంలో నిర్జన ప్రదేశానికి నవీన్‌ను తీసుకువెళ్లాడు. అక్కడ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలోనే హరిహరకృష్ణ కిరాతంగా నవీన్‌ను హతమార్చాడు. తల, చేతి వేళ్లు, మర్మాంగం, గుండెను చీల్చి అన్ని వేరు చేశాడు. తల, వేళ్లు, మర్మాంగాలు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో తీసుకొని బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ రాజీవ్గృహాకల్ప వద్ద కొన్ని భాగాలు, రోడ్డు పక్క తలను పడేసి, ఆ ఊరిలో ఉన్న తన స్నేహితుడిని కలిసి, తన బట్టలు శుభ్రం చేసుకున్నాడు.
తిరిగి అక్కడి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి కోదాడ, విజయవాడ, వైజాగ్ వెళ్లి స్నేహితులతో మాట్లాడుతూ నవీన్ గురించి ఆరా తీశాడు. 23వ తేదీన తిరిగి వచ్చి బ్రాహ్మణపల్లి వద్ద పడేసిన శరీరభాగాలను తిరిగి సేకరించి, హత్య చేసిన స్థలానికి వచ్చి వాటిని పడేశాడు. ఆధారాలు దొరకకుండా బ్యాగ్‌ను కాల్చేశాడు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిని ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టులో దీనిపై వాదనలు జరిగాయి. కస్టడీపై జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది.