కేపీహెచ్బీ కాలనీ, మార్చి 4: జీవనోపాధి కోసం రోడ్లపై ఇసుకను అమ్ముతున్న చిరు వ్యాపారులపై పోలీసుల వేధింపులు ఆపాలని ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలపై వారికి అవగాహన కల్పించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావుకు అల్లాపూర్ కు చెందిన ఇసుక చిరు వ్యాపారులు వినతి పత్రాన్ని అందించారు.
అల్లాపూర్ లోని రోడ్లపై గత కొన్ని సంవత్సరాలుగా రోడ్ల పక్కన ఇసుక వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని ఇటీవల కాలంలో పోలీసులు ఇసుక వ్యాపారులపై కేసులు నమోదు చేస్తూ.. ఇసుక వాహనాలను సీజ్ చేస్తున్నారని, భారీ జరిమానాలు వేస్తున్నారని దీంతో తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోసం రోడ్ల పక్కన ఇసుక చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని పోలీసులు ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు ఏమైనా ఉంటే అక్కడ వ్యాపారం చేసుకునే వారికి వివరించాలని, వారి జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత పోలీసులు, అధికారులపై ఉందన్నారు.