Medchal | మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 6 : బోరు వేస్తున్నా, ఇల్లు కడుతున్నా వెంటనే వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న నకిలీ విలేకరులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ బీఆర్ఎస్ నేత, దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమవారం కీసర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో నకిలీ విలేకరుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఒక్కో పైసా కూడబెట్టుకొని ప్రజలు ఇళ్లు కట్టుకుంటే, బోర్లు వేస్తే నకిలీ విలేకరులు వెంటనే వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడలో తనకు ఉన్న ఇంటి ఆవరణలో అన్ని అనుమతులతో రెండు గదులు నిర్మిస్తుంటే నంబర్ లేని ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వచ్చి తాను హెచ్ఎంటివి విలేకరినంటూ బెదిరించాడని చెప్పారు. ఇంటి నిర్మాణం కొనసాగాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో ఇంటిని కూల్చే వేయిస్తానని నరేష్ రెడ్డి బెదిరించాడని ఆరోపించారు. గతంలో అనేక మంది కీసర పోలీస్ స్టేషన్లో నకిలీ విలేకరి నరేశ్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారని, ప్రస్తుతం తాను కూడా కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. నకిలీ ఐడి కార్డులతో అధికారులు, ప్రజలను, ప్రజాప్రతినిధులను డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్న నకిలీ విలేకరుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.