మేడ్చల్ జోన్ బృందం , డిసెంబర్ 22: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు గణిత విషయ అంశాలపై వ్యాసరచన, డ్రాయింగ్, పజిల్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కీసరలోని అరుంధతి విద్యాలయం హైస్కూల్, మేడ్చల్ పట్టణంలోని న్యూ లిటిల్ లిల్లీ హైస్కూల్లో గణిత దినోత్సవం నిర్వహించారు. పర్వతాపూర్ అరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో రాష్ట్ర స్థాయి క్విజ్, పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్ అభినందించారు.
గణితం ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది
జవహర్నగర్, డిసెంబర్ 22 : గణితం ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుందని, అర్థం చేసుకుంటే గణితంలో అంతులేని మార్కు లు సాధించవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( ఐఐఎస్ఈఆర్ మోహలీ) కపిల్ హరి పరన్జపే అన్నారు. గురువారం బిట్స్ ఫిలానీ క్యాంపస్లో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కపిల్ హరి పరన్జపే, బిట్స్ డైరెక్టర్ సుందర్, గణితశాస్త్ర విభాగాధిపతి పీకే సాహులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు 56 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని పేపర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతనుకోల, ప్రొఫెసర్ సుమిత్, కె.విశ్వనాథ్, డాక్టర్ సుజీత్, డాక్టర్ చక్రవర్తి పాల్గొన్నారు.