“ఓ ఐటీ కంపెనీలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు వీకెండ్స్‌లో రెగ్యులర్‌గా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఒక్కోరోజు ఒక్కరు డబ్బులు పెట్టడం ఇబ్బందిగా మారడంతో వారంతా కలిసి ఏం చేద్దామా అని ఆలోచించారు. బిల్ రాగానే తలా కొంత డబ్బులు వేసుకుంటే ఎవరికీ ఇబ్బంది కాదని ఆలోచించారు. కానీ బిల్లింగ్ సమయంలో అలా డబ్బులు తీసుకుంటే బాగుండదు. వెంటనే వారంతా కలిసి గూగుల్ పేలో ఓ గ్రూప్ క్రియేట్ చేసి ఐదుగురి పేర్లు యాడ్ చేసుకున్నారు. పార్టీ అయిపోగానే వచ్చిన బిల్లు అమౌంట్‌ను ఫోన్‌పే గ్రూప్‌లో యాడ్ చేసి స్లిట్ బిల్‌పై క్లిక్ చేయగానే ఐదుగురికి సమానంగా బిల్ జనరేట్ అవుతుంది. ఎవరి బిల్లు వారు పే చేయాలని రిక్వెస్ట్ వెళ్తుంది. అలా ఆ మొత్తం బిల్లు కట్టిన వ్యక్తికి మిగతా వారు అమౌంట్ సెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐలలో ఉన్న ఆప్షన్స్ ద్వారా బిల్లులు పంచుకుంటున్నారు చాలామంది. ”
సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ ): పార్టీ ఏదైనా ఇప్పుడంతా డచ్చింగ్ డచ్చింగే. రెస్టారెంట్, పబ్, టూర్ ఇలా ఏ సంబురాన్నైనా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు బిల్లు కూడా కలిసే పంచుకుంటారు. అదే డచ్చింగ్. ఔను నగరంలో ఈ కల్చర్ జోరందుకుంది. చిన్న పిల్లల నుంచి మొదలు ఉద్యోగుల వరకు ఎటువంటి పార్టీలైనా బిల్లు మాత్రం అందరూ కలిసి చెల్లిస్తారు. ప్రతీ వీకెండ్ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రణాళిక చేసుకొని పార్టీకి సమాయత్తమవుతున్నారు. ఎప్పుడు?ఎలా? ఎక్కడ? అంతా ముందస్తుగానే పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఒక్కరిపై భారం పడకుండా అందరూ భాగస్వామ్యం అవుతారు. అందుకే నెలకు ఐదారు పార్టీలు విజయవంతంగా ముగుస్తాయని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.
వీకెండ్ జోష్..!!
వారాంతం అనగానే ఉద్యోగులు గుర్తొస్తారు. సాఫ్ట్వేర్ అయితే కంప్యూటర్లపై కుస్తీ, ఇతర ఉద్యోగులు సంబంధిత పనులతో బిజీగా ఉంటారు. అట్లాంటి వారికి శని, ఆదివారాలు సెలవులుగా దొరికితే వారంతా సంతోషంగా గడిపేందుకు పార్టీలు, టూర్లు ప్లాన్ చేసుకుంటారు. వీలైతే నగరానికి ఒక రోజులో వెళ్లొచ్చేలా వీలైన ప్రాంతాలకు వెళ్లి సేద తీరుతారు. అయితే ఇలా వెళ్లడానికి అపార్ట్మెంట్ వారైతే వారి పక్కింటి వారంతా, ఉద్యోగులు వాళ్ల కొలీగ్స్ ఫ్యామిలీలు, స్నేహితులు అయితే సపరేటుగా ఇలా ఎవ్వరు వెళ్లినా డచ్చింగ్ విధానానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఖర్చులు ఎంతైనా చెరి సగంగా చెల్లిస్తున్నారు.
డచ్చింగ్..!
ఈ కల్చర్ విదేశాల్లో చాలా ఏండ్ల క్రితం ఉన్నది. ముఖ్యంగా ఇంగ్లండ్, అమెరికాలో అధిక ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు ఈ కల్చర్ నగరంలో కూడా టాప్‌లో ఉంది. పది మంది కలిసి రెస్టారెంట్‌కు వెళితే ఎవ్వరికి నచ్చినది వారు ఆర్డర్ చేసుకుంటారు. బిల్లు అంతా ఒకే స్లిప్‌లో వస్తుంది. ఆ బిల్లును ఒక్కరు చెల్లించినా.. అతడికి మిగిలిన వారు అప్పుడే తమవంతు బిల్లును చెల్లిస్తారు. ఈ విధానంతో అందరూ హ్యాపీగా పార్టీలను ఎంజాయ్ చేస్తున్నారు.
ముందుగానే అంచనా వేస్తాం
నెలకు నాలుగు పార్టీలు ప్లాన్ చేస్తాం. రెండు పార్టీలు ఫ్యామిలీలతో, మరో రెండు పార్టీలు స్నేహితులతో ఉంటాయి. ప్రతీ పార్టీ డచ్చింగ్ విధానమే. ఖర్చు ఎంతైనా అందరం సమానంగా చెల్లిస్తాం. డచ్చింగ్తోనే పార్టీల సంఖ్య పెరుగుతుంది. నలుగురిలో ఎవ్వరూ ఎక్కువ, తక్కువ తీసుకున్న బిల్లును మాత్రం అందరూ సమానంగా పంచుకుంటాం.
-స్వాతి, ఉద్యోగి
డచ్చింగ్తోనే పార్టీలు సక్సెస్
కరోనాతో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికీ కొన్ని కంపెనీలు కోలుకోలేదు. చాలా వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో పార్టీలు, పబ్‌లు, టూర్లు పెట్టుకోవాలంటే కొంత జంకుతున్నారు. అయితే డచ్చింగ్ విధానంతో పార్టీలను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు వచ్చే బిల్లును అందరూ కలిసి పంచుకుంటాం.