మెహిదీపట్నం డిసెంబర్ 1: బోగస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ముగ్గురిని హబీబ్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మెహిదీపట్నంలోని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ నికిత పంత్, దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ బాలస్వామి, ఆసిఫ్‌నగర్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. నాంపల్లికి చెందిన మహ్మద్ జాకీర్(40), మహ్మద్ షాబుద్దీన్(28), విజయనగర్ కాలనీకి చెందిన రితేష్ గుప్తా(38) గురువారం నాంపల్లి ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నంబర్ 123 సమీపంలో బోగస్ ఓటింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వేలిపై ఉన్న ఇంక్‌ను తొలగించి.. నకిలీ ఓటరు కార్డులతో బోగస్ ఓట్లు వేయించడానికి వీరు పథకం పన్ని అమలు చేశారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ నికిత పంత్ నేతృత్వంలో పోలీసులు వీరిని పట్టుకున్నారు. విచారణ అనంతరం శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 67 నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు, రెండు కెమికల్ సీసాలు, ఒక మిని ప్రింటింగ్ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నదని అధికారులు తెలిపారు.