సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అమీర్‌పేట గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్-వైశాఖీ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. అమీర్‌పేట గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారధ్యంలోని బృందం శుక్రవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
పంజాబ్ నుంచి విచ్చేసిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని.. ఈ వేడుకలకు సుమారు 10వేల వరకు భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వార్ సాహెబ్ ఆమీర్‌పేట కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.