హైదరాబాద్: క్యాతనపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు గుర్రాల(Gurrala Nagaraju) ఆందోళన వ్యక్తం చేశారు. దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టమైన మెజారిటీని భారత రాష్ట్ర సమితికి అందించినప్పటికీ, ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని ఆయన మండిపడ్డారు.
మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని గుర్రాల నాగరాజు ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను, ఆర్థిక ప్రభావాన్ని వినియోగించి ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని నాగరాజు ఆరోపించారు. హంగ్ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రతిపక్ష ప్రతినిధులపై అనైతికంగా ఒత్తిడి తీసుకువచ్చి.. ప్రజా తీర్పును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.