సిటీబ్యూరో: రెండు నిమిషాల సిగ్నల్స్ వద్ద వెయింటింగ్ చేస్తున్న వాహనదారులు ఎండల వేడికి వడదెబ్బ తగిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్ రూఫ్లను ఏర్పాటు చేయాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. గత ఏడాది ప్రయోగాత్మకంగా లిబర్టీ చౌరస్తాలో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసిన అధికారులు.. ప్రస్తుతం ఏ కూడళ్లలోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.
వాహనదారులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ కమిటీ సభ్యులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాన కూడళ్ల వద్ద గ్రీన్ మ్యాట్స్ , అలాగే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పీవైఎల్ కమిటీ సభ్యులు కేఎస్ ప్రదీప్, రవికుమార్, కృష్ణ తదితరులు కోరారు.