సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ మన దేశంలోగాని, రాష్ట్రంలోగాని వచ్చే అవకాశాలు పెద్దగా లేవని, అయితే ఆఫ్రీకా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ముందస్తు చర్యగా గాంధీ దవాఖానలో 25పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ డా.వాణి వెల్లడించారు. గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన ఎబోలా స్టేట్ నోడల్ సెంటర్‌ను నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ సెంట్రల్ కమిటీకి చెందిన ముగ్గురు అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది.
ఆస్పత్రి ప్రధాన భవనం ఏడో అంతస్తులో 8 గదుల్లో 25 పడకలతో నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ డా.వాణి వివరించారు. అనంతరం సెంట్రల్ కమిటీ ప్రతినిధులు ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ డా.ప్రవీణ్ మాదల, బీబీనగర్ ఎయిమ్స్ మైక్రోబయోలజిస్ట్ డా.రాహుల్ గార్డ్, ఎస్ఆర్డీ వరుణ్‌లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఎబలా స్టేట్ నోడల్ అధికారి ప్రొ.సునీల్ కుమార్, జనరల్ మెడిసిన్ అసోషియేట్ ప్రొఫెసర్ వంశీకృష్ణతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.