రవీంద్రభారతి, డిసెంబర్ 22: తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను మెప్పించిన జమునారమణారావు ప్రజానటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని.. ఆమె సినిమా, రాజకీయ రంగానికి చేసిన సేవలు గొప్పవని గవర్నర్ తమిళిసై అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్స్ థియేటర్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతి జమునారమణారావుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డాక్టర్ సినారే -అళ్ల స్వర్ణకంకణం, స్వర్ణవంశీ -శుభోదయం జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ జమున నటించిన అనేక చిత్రాలు రికార్డులు సృష్టించాయన్నారు. మాజీ ఎంపీగా సమాజసేవకురాలని కొనియాడారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్, డాక్టర్ అళ్ల శ్రీనివాస్‌రెడ్డి, చలన చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి , లయన్ డాక్టర్ శ్రీలక్ష్మిప్రసాద్ కలపుట, వంశీ వ్యవస్థాపకుడు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, ఆర్ .ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం అమెరికా గాన కోకిల శారద ఆకునూరు ఆలపించిన అలనాటి గీతాలు ప్రేక్షకులను అలరింపజేశాయి.