సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : అనాలోచిత నిర్ణయాలు తమ పొట్టకొడుతుందని వందలాది బాధితులు మంది రోడ్డెక్కుతుంటే.. అసలు ఉద్యమాన్ని నడిపిస్తుందేవరంటూ కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్తోంది. బాధితుల ఆవేదన, పరిహారం విషయంలో స్పష్టత కోరుతున్నా పట్టించుకోకుండా.. గడిచిన ఆరు నెలలుగా ఉద్యమించడాన్ని జీర్ణించుకోలేక కక్ష సాధింపుచర్యలకు దిగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వినకపోతే కేసులు బనాయించాలనే కుట్ర పూరిత నిర్ణయాలతో బాధితులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తోందని సమాచారం.
నగరంలో కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ఏడాదిన్నర గడిచినా భూసేకరణ పూర్తి కాలేదు. ప్రాజెక్టుకు భూములు ఇవ్వాలని నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రాజీవ్ రహదారి జేఏసీ పేరిట వందలాది మంది భూ బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు కారణంగా తమ జీవనాధారం లేకుండా పోతుందని, ప్రాజెక్టు వెడల్పును 200ఫీట్ల నుంచి 120ఫీట్లకు తగ్గించడం వలన కనీసం 50శాతం ఆస్తులైన మిగిలే అవకాశం ఉందని చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. వందలాది మంది భూములు కోల్పోయి జీవనాధారం లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నా బాధితులకు సర్కారు అండగా నిలవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా బాధితులపై నిఘా పెడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
పాదయాత్రకు అనూహ్య స్పందన
భూ బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ర్యాలీ, నిరసన కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు భూములు కోల్పోతున్న నిర్వాసితులందరూ పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు.