
ఫీజు కట్టలేదనే నెపంతో ఆయా ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులపై వేటువేసేవి. అడిగిన కాడికి కాసులు కుమ్మరించాలని డిమాండ్ చేసేవి. కాని సీన్ మారింది.. ఇప్పుడు విద్యార్థులే ప్రైవేటు స్కూళ్లపై వేటు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల్లో సకల వసతులు కల్పించడంతో పాటు ప్రైవేటుకు మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు కాసుల చదువులకు గుడ్‌బై చెప్పి.. సర్కార్ బడుల బాట పడుతున్నారు. నైపుణ్యంగల ఉపాధ్యాయులు భోదించే చదువునే చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతూ అడ్మిషన్లు పొందుతున్నారు.
మేడ్చల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులే అధికంగా చేరుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 9718మంది విద్యార్థులు చేరగా.. అందులో 3408 మంది (40 శాతం) ప్రైవేట్ స్కూళ్లనుంచి వచ్చిన వారే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడంతో పాటు నాణ్యమైన విద్య ను నైపుణ్యంగల ఉపాధ్యాయులచే భోదిస్తున్నది. అంతేకాకుండా సకల వసతులు కల్పించడంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నది. దీంతో తల్లిందండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చించేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో 5, 6, 7 తరగతులు చదివే విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రభుత్వ బడుల్లో చేరారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 519 ప్రభు త్వ పాఠశాలలు ఉండగా 77,223 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నెల 31 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ప్రభు త్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 108 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 99 పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియం కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఆన్లైన్ తరగతులను విద్యాశాఖ నిర్వహిస్తున్నది. ఈ నెల 2వ తేదీ 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన విషయం విధితమే.
ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం మరింత పెరిగింది. 5, 6, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు అధికంగా చేరుతున్నారు. సర్కార్ బడులను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం.- ఎన్.ఎస్.ఎస్.ప్రసాద్, మేడ్చల్-మల్కాజిగిరి విద్యాధికారి