సుల్తాన్‌బజార్,జూన్ 2 : ఓ ప్రైవేటు దవాఖానలో గర్భిణికి సిజేరియన్ చేసి పురుడుపోశారు.. అయితే రెండు గంటల్లోనే ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురైంది.. మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పగా అక్కడికి తీసుకెళ్లారు.. అక్కడ మొదట రూ.లక్ష అడుగగా .. మాకు అంత స్థోమత లేదని చెప్పగా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించగా… సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు ఆమెను అడ్మిట్ చేసుకొని మెరుగైన వైద్యం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
మౌలాలికి చెందిన షెహజాదా(30) నాలుగో కాన్పు నిమిత్తం మాసబ్‌ట్యాంక్ ఫస్ట్‌లాన్సర్‌లోని తల్లిగారింటి సమీపంలోని ఓ నర్సింగ్ హోంలో చేరింది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వైద్యులు సిజేరియన్ చేయగా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే కాన్పు అయిన రెండు గంటల తర్వాత బాలింతకు తీవ్ర రక్త స్రావం అయ్యింది.. అదే సమయంలో రెండుసార్లు ఫిట్స్ వచ్చాయి.. దీంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలింత పిన్ని మెహర్ బేగం..బంజారాహిల్స్‌లోని రోడ్డు నం. 1లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.. అక్కడి వైద్యులు పరీక్షించి.. బాలింత పరిస్థితి విషమంగా ఉందని.. ముందుగా అడ్వాన్స్‌గా రూ. లక్ష కట్టాలని చెప్పారు..
దీంతో మేం పేదవారని అంత డబ్బు కట్టలేమని చెప్పగా.. ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బాలింతను ఉస్మానియా దవాఖానకు రాత్రి 12.30 గంటల సమయంలో తీసుకువెళ్లగా…అక్కడ గైనకాలజీ వైద్యులు లేరని.. కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు తీసుకువెళ్లాలని రిఫర్ చేయగా… రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడికి తీసుకెళ్లారు. ప్రసూతి దవాఖాన వైద్యులు షెహజాదాను పరిశీలించగా అప్పటికే బీపీ, పల్స్ పూర్తిగా పడిపోయి ఉండటంతో వెంటనే వైద్య చికిత్స ప్రారంభించారు.. 8 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
సరైన ఎక్విప్మెంట్, నిష్ణాతులైన వైద్యులు లేని చిన్న చిన్న దవాఖానల్లో నాలుగో కాన్పు చేయడం వల్ల ఒక్కోసారి బాలింత మృతి చెందే అవకాశాలు లేకపోలేవని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ బాలింత విషయంలో సిజేరియన్ చేసే సమయంలో అనస్థీసియా సమస్య ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సమయాల్లో నాలుగో కాన్పు ప్రసవంలో యూట్రస్ దెబ్బతిని బాలింతకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు. దవాఖానకు వచ్చిన సమయంలో బాలింత పరిస్థితి పూర్తిగా విషమంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు.