బంజారాహిల్స్, జూలై 26 : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12ఎకరాల స్థలంలో ఆలయం తొలగింపు వ్యవహారంలో తవ్విన కొద్దీ సరికొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఎమ్మెల్యే కాలనీ పక్కనున్న ప్రభుత్వం స్థలంలో పడమర భాగంలో స్థానిక యాదవ సామాజికవర్గానికి చెందిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయాన్ని రెవెన్యూశాఖ అధికారులు కూల్చేయడంతో పాటు విగ్రహాన్ని వేరోచోటకు తరలించిన సంగతి తెలిసిందే.
ఆక్రమణలను తొలగించి..
షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్ 102/1లో టీఎస్1/పీ, 3/పీ, బ్లాక్-జే వార్డు 12లో సుమారు-12ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంలో కొంతభాగాన్ని గతంలో శ్రీ వేంకటేశ్వర హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది ఆక్రమించారు. ఇదంతా సొసైటీకి చెందిన ఓపెన్ ల్యాండ్ అంటూ లే అవుట్లో పేర్కొనడంతో బయటి వ్యక్తుల దృష్టి పడలేదు. కాగా నిర్మానుష్యమైన కొండప్రాంతం కావడం, బయటి వ్యక్తులకు దారిలేకపోవడంతో ఈ స్థలాన్ని స్ట్రే బిట్స్‌గా పేర్కొంటూ గతంలో సొసైటీ పెద్దలు కొంతమందికి అమ్మి సొమ్ముచేసుకున్నారు.
సుమారు 20ఏళ్లుగా సుమారు 3వేల గజాల మేర ఆక్రమణలు వెలిసాయి. కొంతమంది సదరు స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేసుకుని గత ప్రభుత్వంలో జీవో 59 కింద క్రమబద్ధీకరించుకోగా, మరికొంతమంది సొసైటీ ప్లాట్లే అనే ఉద్దేశంతో క్రమబద్దీకరణ చేసుకోలేదు. ఇదిలా ఉండగా ఆరునెలల క్రితం అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో సమగ్రమైన సర్వే నిర్వహించారు.
ప్రభుత్వ రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించగా సర్వే నెంబర్ 102/1లో టీఎస్1/పీ, 3/పీ, బ్లాక్-జే. వార్డు 12లో సుమారు-12ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం బయటపడింది. దీంతో అప్పటిదాకా సొసైటీకి చెందిన స్థలమని భావిస్తూ వచ్చిన ఎమ్మెల్యే కాలనీ వాసులు షాక్‌కు గురయ్యారు. 12 ఎకరాల స్థలంలోనే ఎమ్మెల్యే కాలనీ సొసైటీలో ఓపెన్ ల్యాండ్‌గా పేర్కొన్న స్థలం ఉండడంతో సదరు నిర్మాణాలను కూల్చివేతలు ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని ఆక్రమణలను కూల్చేయగా,మరికొంతమంది కోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఆక్రమణలను ఆనుకుని ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయాన్ని కూల్చేయడంతో కలకలం ప్రారంభమైంది.
స్థలం విలువ రూ. 1200 కోట్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో షేక్‌పేట రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శ్రమించి 12ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ. 1200 కోట్లు ఉంటుంది. కాగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసిన తర్వాత మే 3న హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పర్యటించారు. కాగా ఈ స్థలంలో పెద్ద ఎత్తున వృక్షాలు, బండరాళ్లు, కొండప్రాంతం ఉండడంతో తమ కాలనీతో పాటు నగరవాసులకు ఉపయోగపడేలా ఎకో పార్క్ తయారు చేయాలంటూ ఎమ్మెల్యే కాలనీ వాసులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.
దీంతో ప్రజల అవసరాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ స్థలాన్ని పర్యావరణానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. దీనికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్థలాన్ని హెచ్ఎండీఏకు కేటాయించాలని, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలంటూ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సైతం స్థలాన్ని హెచ్ఎండీఏకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మూడునెలల క్రితమే హెచ్ఎండీఏ అధికారులు ఎమ్మెల్యే కాలనీలోని 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. సహజసిద్ధమైన బండరాళ్లతో, భారీ వృక్షాలతో ఉన్న స్థలాన్ని ఎకో పార్కుగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే మూడునెలలు గడిచినా హెచ్ఎండీఏ రంగంలోకి దిగి అభివృద్ధి ప్రణాళికను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే స్థలాన్ని అమ్ముకోవాలనే ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక మంత్రులు,అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. మూడునెలల క్రితం ఎకో పార్కుగా మారుస్తామని చెప్పిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు కలెక్టర్ హరిచందన ఒత్తిడితోనే రాత్రికి రాత్రే ఎమ్మెల్యే కాలనీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేసినట్లు తెలుస్తోంది. ఎకో పార్క్‌కు కాకుండా స్థలాన్ని వేరేవ్యక్తులకు అమ్మితే ఊరుకునేది లేదని స్థానికులు సైతం హెచ్చరిస్తున్నారు.