హిమాయత్‌నగర్, మార్చి 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఎల్పీజీ ఆటో గ్యాస్ కొరతను తీర్చాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో ఎల్పీజీ కొరత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం హిమాయత్‌నగర్‌లోని వై జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం వచ్చిందంటే దాని ప్రభావం సామాన్య ప్రజలే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు.
ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడటం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీజీ గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి పెట్రోల్ పంపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడిన లైన్ వచ్చే వరకు గ్యాస్ దొరుకుతుందో లేదో అనేది స్పష్టత లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఎల్పీజీ గ్యాస్ రెట్లు పెంచడంతో ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు.
దేశంలో ఇంధనం కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదన్నారు. ఇంధనం కొరత ఇలాగే కొనసాగితే ఆటో డ్రైవర్లు వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సీనియర్ నేత వి.ఎస్.బోస్, యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్.అశోక్,నగర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.జంగయ్య,నేతలు ఒమర్‌ఖాన్,ఎం.నర్సింహ, పి.శ్రీనివాస్,ఎం.కృష్ణ,లతీఫ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.