శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 22, 2021 , 06:06:04

పరీక్షలూ ఉచితమే

పరీక్షలూ ఉచితమే

  • నగరంలో మరో 8 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు 
  • వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఐదు, యూపీహెచ్‌సీల్లో మూడు
  • సులువు కానున్న వైద్య పరీక్షలు 
  • అందుబాటులోకి 108 రకాల టెస్ట్‌లు 
  • నేడు మంత్రులచే ప్రారంభోత్సవం  

వైద్య సేవలను సులభతరం చేసిన ప్రభుత్వం..వ్యాధి నిర్ధారణకు ముందు చేయాల్సిన పరీక్షలను అందరికీ చేరువ చేసేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నది. ప్రైవేటు కేంద్రాల్లో వైద్య పరీక్షలు భారంగా మారడంతో ప్రభుత్వమే ఉచితంగా చేసేందుకు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే నారాయణగూడ ఐపీఎంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల నుంచి వచ్చే నమూనాలను పరీక్షిస్తున్నారు. ఈ సేవలను మరింత వికేంద్రీకరించే ఉద్దేశంతో నగరంలో మరో 8 చోట్ల డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 5, యూపీహెచ్‌సీల్లో మూడింటిని ఏర్పాటు చేయగా, శుక్రవారం వీటిని మంత్రులు కేటీఆర్‌, ఈటల, మహమూద్‌అలీ ప్రారంభించనున్నారు. 

హైదరాబాద్ : నగరంలోని పేదలకు ఉచితంగా అన్ని రకాల డయాగ్నోస్టిక్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మినీహబ్‌లు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ తదితరులు శుక్రవారం వీటిని ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూసీహెచ్‌సీలు, వెల్‌నెస్‌ సెంటర్ల, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్‌ హాస్పిటళ్లు, డిస్పెన్సరీ హాస్పిటళ్లకు వచ్చే రోగులకు ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు సేవలు అందించనున్నాయి. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఈసీజీ, రేడియాలజీ, యూఎస్‌జీ, ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలతో నగరంలోని పేదలకు ఉచితంగా వైద్యపరీక్షలు అందుబాటులోకి వస్తాయని, వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. లాలాపేట మినీ హబ్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, శ్రీరామ్‌నగర్‌ మినీహబ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. బార్కాస్‌, రాణిపురా, పురానాపూల్‌లో  హోంమంత్రి మహమూద్‌ అలీ, అంబర్‌పేటలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జంగమెట్‌, సీతాఫల్‌మండిలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రారంభిస్తారు. 

108 టెస్టులు

 108 రకాల వైద్య పరీక్షలు ఈ మినీ హబ్స్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నారాయణగూడలోని ఐపీఎంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు బస్తీ దవాఖానలతో సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని నమూనాలు పంపిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పూర్తి స్థాయి వైద్యపరీక్షలు అందుబాటులోకి రావడమే కాకుండా వాటి ఫలితాలు కూడా త్వరగా వచ్చి.. సకాలంలో చికిత్స అందించే వీలుంటుంది. తాజాగా  వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఐదు ఆరోగ్య కేంద్రాలు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను నెలకొల్పారు.  నూతనంగా అందుబాటులోకి రానున్న డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో  ఎక్స్‌-రే, స్కానింగ్‌, ఈసీజీ తదితర పరీక్షలతో పాటు రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు వంటి టెస్టులు చేయనున్నట్లు  హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి వెల్లడించారు.

VIDEOS

logo