OTS | సిటీబ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం తుది గడువు సమీపిస్తున్నది. మరో రెండు రోజుల్లో ( ఈ నెల 30వ తేదీ) గడువు పూర్తవుతుంది. వినియోగదారులు పెండింగ్‌లో ఉన్న అసలు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ రెండు రోజులు ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
కాగా, జలమండలి పరిధిలో 7,11030 మంది బకాయిదారులకు ఓటీఎస్ సద్వినియోగం చేసుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం లక్ష మంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. రూ. 1792 కోట్లు ఓటీఎస్ రూపంలో రావాల్సి ఉండగా, కేవలం రూ. 90కోట్లు మాత్రమే వచ్చింది. ఓటీఎస్‌ను సకాలంలో ప్రజల్లోకి తీసుకోలేకపోవడం, విధి విధానాల అమల్లో ఆలస్యం, అవగాహన లేమి తదితర కారణాలతో ఓటీఎస్ ఆదరణ కరువైందని చెబుతున్నారు.