Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా మళ్లీ బీజేపీలో చేరేదే లేదని కుండబద్ధలు కొట్టిన రాజా సింగ్.. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలు పిలిస్తే మళ్లీ పార్టీలో చేరతానని అన్నారు. వేరే పార్టీలో చేరనని.. తనకు వేరే పార్టీలు సెట్ అవ్వవని చెప్పారు.
తన వల్ల కొన్ని తప్పులు జరిగాయి.. సోషల్‌మీడియా ద్వారా మరికొన్ని తప్పుడు ప్రచారాలు చేశారని రాజా సింగ్ తెలిపారు. పార్టీలో మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉంటారని.. వాళ్లే రాజా సింగ్ లీక్ ఇస్తున్నారని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. అందుకే తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. పెన్‌డ్రైవ్‌లో తన మీద ఫిర్యాదులు పంపించారని రాజా సింగ్ తెలిపారు. ఫిర్యాదులు, సోషల్‌మీడియా వార్తలతోనే తన రాజీనామాను బీజేపీ పెద్దలు ఆమోదించారని వివరించారు. పెద్దలు పిలిస్తే ఢిల్లీకి వెళ్లి జరిగిందంతా వివరిస్తానని అన్నారు.
మా పెద్దలు పిలిస్తే ఢిల్లీకి వెళ్లి జరిగింది అంతా చెబుతానని రాజా సింగ్ అన్నారు. చాలామంది పార్టీని ఎందుకు విడిచి వెళ్లారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు.. ఇవన్నీ వివరిస్తానని తెలిపారు. ఇవాళ కాకపోతే, రేపు అయినా పిలుస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాదని ఆయన తెలిపారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని.. ఎమ్మెల్యే పదవికి కాదని స్పష్టం చేశారు. ఇంకో మూడేళ్ల పాటు తాను ఎమ్మెల్యేగానే ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్‌లో చేరారని.. అక్కడ ఉప ఎన్నిక రానిది గోషామహల్లో ఎందుకొస్తుందని ఆయన ప్రశ్నించారు.