ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 7: వచ్చే నెలలో సూర్యాపేట జిల్లాలో వారం రోజుల పాటు జరుగబోతున్న గొల్ల గట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి. ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగనున్న గొల్ల గట్టు సాంస్కృతిక చరిత్ర సదస్సు పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, జాతరకు పూర్తి కాల చైర్మన్, కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
జాతర సమయంలోనే పరిమితమైన నిధులు కాకుండా అధిక నిధులు కేటాయించి, సంవత్సరం పొడుగునా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గొల్ల గట్టు జాతరపై అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలను మానుకుని అక్కడ యాదవులు ఆశ్రిత కులాలైన బైకాని వారిని ప్రభుత్వం గుర్తించి, వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వట్టె జానయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, బారి అశోక్ యాదవ్, కడారి రమేశ్ యాదవ్, నూకల మధు, కాయిత సతీశ్, నానబాల సంతోష్ యాదవ్, మహేశ్, శివశంకర్, సురేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.