హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు.. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర కిషన్ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్నారని చెప్పారు. విగ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు.
మత కలహాలు జరుగకుండా అడ్డుకోవాలని కేంద్ర కిషన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి గేట్లు విరగొట్టారని చెప్పారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు. ఆలయాలపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలన్నారు.