బేగంపేట, అక్టోబర్ 14: సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారనే విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ నేత మాధవీలత, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు, అందె శ్రీనివాస్, సుధీంద్ర, చికోటి ప్రవీణ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు గజ్జెల నగేశ్, నివేదిత తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ముంబైకి చెందిన సల్మాన్‌గా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.
నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కొంత మంది మతోన్మాదశక్తులు దాడులకు పాల్పడుతూ మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఇది నాలుగో ఘటన అని గుర్తు చేశారు. మతి స్థిమితం లేని వారు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరి కాదన్నారు. దోషులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి, వారి వెనుక ఎవరి హస్తం ఉన్నదో గుర్తించాలని, వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైన కఠినంగా శిక్షించాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. పట్టుబడిన వ్యక్తి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించి.. వెనుక ఉన్న వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలన్నారు.
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని గజ్జెల నగేశ్ అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవ హరించకపోతే దీన్ని ప్రభుత్వ కుట్రగా భావించాల్సి వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమ వారం రాత్రి ఆయన దేవాలయాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితిని స్థానికులను, పోలీసులను అడిగి తెలుసుకు న్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోడు చేశాడని చెప్పడం పోలీసులకు అనవాయితీగా మారిందన్నారు. రెండు వందల ఏండ్ల చరిత్ర ఉన్న అమ్మవారిని కాలుతో తన్ని ధ్వంసం చేయడం చూసి స్థానిక మహిళలు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క మంత్రి కూడా రాలేదని, మాట్లాడలేదని విమర్శించారు.