మెహిదీపట్నం జూలై 3: బక్రీద్ పండుగ రోజు మేక మాంసం (హిస్సా) సరఫరా చేస్తామని చెప్పి నగర వ్యాప్తంగా అనేక మంది నుంచి 60 లక్షల రూపాయల నగదును వసూలు చేసి పరారైన ఓ ముగ్గురు సభ్యుల ముఠాను హబీబ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 23 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం మెహిదీపట్నంలోని దక్షిణ- పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, అదనపు డీసీపీ అష్వాక్ అహ్మద్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ రాంబాబు కలిసి వివరాలను వెల్లడించారు. మల్లేపల్లి అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ సమీపంలో ఉన్న కిద్మత్ ఫౌండేషన్ వారు మల్లేపల్లి ఆగాపురాకు చెందిన అబ్దుల్ బారి రహమాన్(37)ను బక్రీద్ పండుగ సందర్భంగా హిస్సా(మేక మాంసం) సరఫరా చేస్తామని సంప్రందించారు.
పాతబస్తీ చందులాల్ బారాదరికి చెందిన మహ్మద్ నసీర్(30), బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సన్‌సిటీ వద్ద పీఆండ్‌టీ కాలనీలో నివసించే మహ్మద్ జాఫర్ అహ్మద్(29), మహ్మద్ అష్వాక్(27)లు కిద్మత్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది జంటనగరాల్లో ముస్లింలకు మేక మాంసం సరఫరా చేస్తున్నారు. ఖుర్బానీ మాంసాన్ని బక్రీద్‌లో హిస్సాగా పిలుస్తారు. ఈ సంవత్సరం కూడా హిస్సాను సరఫరా చేస్తామంటూ జంట నగరాల్లో అనేక మంది నుంచి సుమారు 60 లక్షల రూపాయల నగదును వసూలు చేశారు. తీరా బక్రీద్ పండుగ రోజు పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆగాపురకు చెందిన అబ్దుల్ బారి రహెమాన్ హబీబ్‌నగర్ పోలీసులకు జూన్ 17న ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి, కిద్మత్ ఫౌండేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 23 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.