చార్మినార్, జూలై 6 : పురాతనమైన గుల్జార్‌హౌస్ ఫౌంటేన్ కొత్త కళను సంతరించుకున్నది. పాతనగర అభివృద్ధి సంస్థ కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో గుల్జార్ హౌస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నాలుగు నెలలుగా గుల్జార్‌హౌస్‌కు నగిషీలను చెక్కుతున్న కళాకారులు పాతనగర పర్యాటకానికి మరింత శోభను చేకూరుస్తున్నారు. సుమారు రూ.30 లక్షల నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులను ఇరానీ వాస్తు శిల్పితోపాటు మోరాకో, టర్కీ దేశాల శిల్పకళతో తీర్చిదిద్దుతోంది. కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న గుల్జార్‌హౌస్‌ను గతంలో కంటే 5 అడుగుల ఎత్తు పెంచుతూ చుట్టూ పటిష్టమైన గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నామని కాంట్రాక్ట్ నిర్వాహకులు తెలిపారు.
కాంతులీనుతున్న పంప్‌హౌస్..
పగలే కాదు.. రాత్రి సమయంలోనూ నీటి తుమ్మెరలను చిమ్ముతూ రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో గుల్జార్ హౌస్ కాంతులీనుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పంప్‌హౌస్ అడుగు భాగంలో ప్రత్యేక శైలితో నిర్మాణాలు చేయడంతో గుల్జార్‌హౌస్ వీక్షకులకు ఆహ్లాదాన్ని పంచనుంది.
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..
గుల్జార్‌హౌస్ ఫౌంటేన్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావడంతో వారం రోజుల్లో ప్రజల సందర్శనానికి రానుందని అధికారులు తెలిపారు.