POCSO Case | బొల్లారం, జూన్ 24 : మద్యం మత్తులో కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిపై బొల్లారం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం కంటోన్మెంట్ క్వార్టర్స్‌లో నివాసముండే బాల నాగరాజు(40), లక్ష్మి దంపతులు. నాగరాజు వృత్తిరీత్యా పెయింటర్. గత కొన్ని రోజులుగా నాగరాజు అతిగా మద్యం సేవించి వచ్చి భార్య, కుమార్తెను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ కొడుతున్నాడు. కాగా ఈనెల 22న అతిగా మద్యం సేవించి కుమార్తెను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా తాకాడని తమ కుమార్తె ఏడ్చుకుంటూ చెప్పిందని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.