YS Jagan | సిటీబ్యూరో: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూల్చివేత ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సంపత్ ఆధ్వర్యంలో శనివారం జగన్ నివాసం బయట ఫుట్‌పాత్‌పై నిర్మించిన సెక్యూరిటీ గదులను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమిపాలవ్వడంతో భద్రతను తొలగించడం, గురు దక్షిణగా ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు జరిపిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడేపై జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టడంపై ఆయనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతోనే కూల్చివేతలు జరిపానని సదరు జోనల్ కమిషనర్ వివరణ ఇచ్చారు. అయినా కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్ హేమంత్‌ను బాధ్యతల నుంచి తొలగించి.. జీఐడీకి రిపోర్టు చేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.