ఖైరతాబాద్, మే 2 : నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు కన్నీటి పర్యంతమైంది. ఖైరతాబాద్ జోన్‌లోని జూబ్లీహిల్స్ సర్కిల్ 18 పరిధిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న డేరంగుల నారాయణమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించింది.
గత 20 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా సేవలందిస్తున్నానని నారాయణమ్మ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయనను కలిసి తన గోడును వెల్లబోసుకున్నానని తెలిపారు. తనకు నిలువ నీడలేదని, ఏదైనా జాగా చూపిస్తే గుడిసె వేసుకుంటానని చెప్పగా, వెంటనే స్పందించిన వైఎస్ఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఫిల్మ్‌నగర్‌లోని వినాయక్‌నగర్‌లో 124 గజాల స్థలం కేటాయించారన్నారు. చిన్న గుడిసె వేసుకొని భర్త, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుండగా, ఆ స్థలం విలువైంది కావడంతో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, అతని అనుచరుల కండ్లు పడ్డాయన్నారు. గత 20 సంవత్సరాలుగా తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని, 20 సార్లు గుడిసెను కూలగొట్టించారని, రెండు సార్లు తగులబెట్టించారన్నారు. తన భర్త మరణించిన తర్వాత ఆ నాయకుల వేధింపులు పెరిగాయని, ఆ స్థలం విషయంలో తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. పారిశుధ్య కార్మికురాలిగానే కాకుండా భక్తి పాటలు, పద్యాలు ఆలపిస్తానని, ప్రవచనాలు చేస్తానని, జీహెచ్ఎంసీ ఉత్తమ సేవకురాలిగా గుర్తించగా, అనేక అవార్డులు అందుకున్నానని, గతేడాది గణతంత్ర పరేడ్‌లో సైతం పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చిందన్నారు. కాని కాంగ్రెస్ నేతల చర్యల వల్ల తాను నీడ కోల్పోయానని వాపోయారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్, అతని అనుచరులతో ప్రాణగండం
గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకుడు మామిడి నర్సింగ్ రావు, వారి అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అనేక సార్లు దాడులు సైతం చేయించారని, ప్రాణభయంతో బాల్‌రెడ్డినగర్‌లో ఉన్న తన కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నట్లు నారాయణమ్మ తెలిపారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పేదరికంపై దయతలచి భూమి ఇస్తే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, అతని అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని మీడియా సమావేశంలో వాపోయారు. ఎమ్మెల్యే దానం, అతని అనుచరులతో తనకు ప్రాణగండం ఉందని, తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
తానే కబ్జా చేశానంటూ ఎమ్మార్వో అనితా రెడ్డి తప్పుడు కేసు
ప్రభుత్వం అధికారికంగా ఫిల్మ్‌నగర్‌లోని వినాయకనగర్‌లో 124 గజాల స్థలం కేటాయించారని, రాళ్ల గుట్టలుగా ఉన్న ఈ స్థలాన్ని తాను, తన కుటుంబ సభ్యులతో చదును చేసుకొని గుడిసే వేసుకున్నానని నారాయణమ్మ తెలిపారు. బల్దియాలో రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇంటి. నం.8-2-293/82/వీఎన్/392 కేటాయించారని అన్నారు. ప్రస్తుతం కబ్జాదారులు తాను వేసుకున్న గుడిసెను నేలమట్టం చేశారని, ఇటీవల తన స్థలంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లగా, షేక్‌పేట ఎమ్మార్వో తాను ఆ భూమిని కబ్జా చేశానంటూ తప్పుడు కేసు పెట్టారని వాపోయారు. తన స్థలాన్ని కబ్జా చేస్తున్నా పట్టించుకోని ఎమ్మార్వో ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని తానే కబ్జా చేశానంటూ ఫిర్యాదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.