Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కోతుల బెడద నుంచి శాశ్వత విముక్తి కల్పించే చర్యలకు జీహెచ్ఎంసీ ఉపక్రమించింది. తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరి గదుల్లోని సామగ్రిని చిందర వందర చేయడం, మనుషులపై దాడి చేస్తున్నాయి. దేవాలయాల వద్ద కొబ్బరి చిప్పలు, అరటిపండ్ల వంటి వాటికోసం పైకి ఎగబడి భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న సందర్భాలున్నాయి. కోతుల బెడదతో విసిగిపోతున్నామని ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలని భావించారు. ఈ మేరకు ఖైరతాబాద్, చార్మినార్, కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో కోతులను నగరం నుంచి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు టెండర్లను ఆహ్వానించారు.
ఈ మేరకు కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించి కోతులను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం, సామగ్రి కలిగిన ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. మిగిలిన చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో టెండర్లకు స్పందన లేకపోవడంతో తిరిగి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగంలో కుకలను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న కార్మికులున్నప్పటికీ, కోతులను పట్టుకునేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బంది లేకపోవడంతో గడిచిన రెండేళ్లుగా కోతుల సమస్య నగరవాసులను వెంటాడింది. తాజాగా నాలుగు జోన్లకు సంబంధించి రాబోయే రెండు నెలల్లోగా కోతుల బెడద నుంచి విముక్తి కల్పించనున్నారు.
ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పద్మారావునగర్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, తార్నాక, అమీర్‌పేట, కాప్రా, డీబీఆర్ మిల్స్, టెలికాం నగర్, కోఠి, పద్మారావు నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తున్న కోతులతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భయంతో వణికిపోతున్నారు. కోతి చేష్టలతో విసిగిపోతున్నట్లు తరచూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోతుల నియంత్రణపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. నగరం నుంచి అటవీ ప్రాంతానికి తరలించే సమయంలో సంబంధిత అటవీశాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రధానంగా కోతులకు ఎటువంటి గాయం కాకుండా చూడాలి. సదరు ఏజెన్సీ కోతులను పట్టుకోవడం, వాటికి ఆహారం ఇవ్వడం, రవాణా చేయడంలో మునుపటి అనుభవం, కోతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తన సొంత ఖర్చుతో వాటికి సరైన ఆహారం, నీరు పెట్టడం, నివాసం కల్పించాలి. ఒకవేళ కొన్ని రోజుల పాటు సదరు ఏజెన్సీ వద్ద బందీగా ఉన్న కోతుల కోసం ఇంటిని చక్కగా, శుభ్రంగా ఉంచడం తప్పనిసరి. అన్నింటికంటే కోతులకు ఎటువంటి గాయం లేకుండా, అసౌకర్యం కలిగించకుండా వీలైనంత మానవీయంగా కోతులను పట్టుకోవాలి. ఈ విషయంలో కోతులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లినా రూ.200 నుంచి 1000 మేరకు సదరు ఏజెన్సీకి జరిమానా విధిస్తారు.