GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేస్తున్నది. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకుంటున్న వారిపై 25 శాతం అదనపు రుసుమును వసూలు చేస్తూ ఖజానాను నింపుకుంటున్నది.
వాస్తవంగా గ్రేటర్లో వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించిన జనవరి 31తో ఉచితంగా రెన్యూవల్ చేసే గడువు ముగిసింది. ఈ నెల 1 నుంచి రెన్యూవల్ చేసుకోనున్న ట్రేడ్ లైసెన్స్‌లపై ఫీజులో 25 శాతాన్ని పెనాల్టీ వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 1 నుంచి నెలాఖరు వరకు 50 శాతం జరిమానాగా వసూలు చేయనున్నారు.
ఏప్రిల్ నుంచి రెన్యూవల్ చేసుకునే వ్యాపారుల నుంచి చెల్లించాల్సిన ట్రేడ్ ఫీజులో వంద శాతం జరిమానా వసూలు చేయనున్నారు. కాగా మెడికల్ ఆఫీసర్, లైసెన్సింగ్ ఆఫీసర్ ప్రతి రోజు కనీసం 20 వ్యాపార సంస్థలను నేరుగా కలిసి వ్యాపారస్తుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం (ఈ నెల 23వ తేదీ) నాటికి 78 వేల మంది వ్యాపారస్తుల నుంచి బల్దియా రూ. 76 కోట్ల మేర ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇంకా 32 వేల మంది వ్యాపారస్తులపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికల్లా రూ. 120కోట్ల వరకు ట్రేడ్ లైసెన్స్ ఆదాయం రాబడతామని అధికారులు తెలిపారు.