సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఖజానా నింపుకొనేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లులో బడాబాబులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను పట్టించుకోని బల్దియా అధికారులు.. సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వసూళ్లను రాబట్టుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రూ.960 కోట్ల మేర పైగా ఆదాయాన్ని సమకూర్చుకున్న అధికారులు.. ఈ ఏడాది చివరి నాటికల్లా రూ.3వేల కోట్ల వసూళ్ల రూపంలో రాబట్టుకోవాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే తాజాగా భవనం కట్టకుండా ఖాళీ ప్లాట్లపై వీఎల్టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వసూలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ టార్గెట్ విధించారు. సాధారణంగా భవనాలు నిర్మించుకున్నాక ఆస్తిపన్ను చెల్లించడం ప్రజలకు అలవాటు. భవనం కట్టకుండా ఖాళీ ప్లాట్‌గా ఎంతకాలం ఉన్నా దానికి పన్ను చెల్లించేందుకు చాలా మంది సముఖంగా ఉండరు.
ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాలి. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్టీగా చెల్లించాలి. దాదాపు రెండేండ్ల కిందట రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 32వేల వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి నుంచి దాదాపు రూ. 110 కోట్ల ఆదాయం సమకూరుతుందని నిర్ణయించి డ్రైవ్ చేపడుతున్నారు.
పన్ను చెల్లిస్తే పీటీఐఎన్ జనరేట్..
సాధారణంగా ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు పీటీఐఎన్ పొందాలంటే నిర్మాణం పూర్తయ్యాక జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దరఖాస్తుదారు ఇంటిని సందర్శించి ప్రాంతం, నిర్మాణం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేస్తారు. దీంతో పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. అనంతరం పన్ను చెల్లించి రసీదు పొందవచ్చు. పీటీఐఎన్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే, ఖాళీ ప్లాట్లకు వీఎల్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కూడా స్థానిక జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
అనంతరం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ప్లాటును తనిఖీచేసి అక్కడి మార్కెట్ ధర ఆధారంగా 0.5శాతం పన్ను విధిస్తారు. పన్ను చెల్లిస్తే పీటీఐఎన్ జనరేట్ చేసి వీఎల్టీ రసీదు జారీ చేస్తారు. కాగా, ఇంటి అనుమతులకు వెళ్లే సందర్భంలో మాత్రమే వీఎల్టీ చెల్లిస్తున్నారు. మొత్తంగా అసెస్ కానీ ఖాళీ ప్లాట్లను కూడా క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని ట్యాక్స్ జాబితాలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.