సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భవన నిర్మాణ రంగ అనుమతుల నిబంధనలు సామాన్యులకే తప్ప బడా బిల్డర్లకు ఏ మాత్రం వర్తించడం లేదు. సామాన్యుడి తన చిన్న పాటి స్థలంలో ఇంటి నిర్మాణం జరిపితే నిబంధనల పేరుతో నానా ఇబ్బందులు పెట్టే టౌన్ ప్లానింగ్ విభాగం..కళ్ల ముందు వాణిజ్య భవనాలు నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారి జోలికి వెళ్లడం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓసీ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న ఓ షాపింగ్ మాల్ భవనాన్ని బుధవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. సదరు బహుళ అంతస్తు భవన నిర్మాణాదారు మల్టీపెక్స్ కోసం మూడు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లస్ 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పూర్తి అయ్యాకనే ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలి. కానీ ఓసీ లేకుండా షాపింగ్ మాల్‌ను తెరిచారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సంబంధిత భవనాన్ని సీజ్ చేయడంతో పాటు యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఒక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోనే కాదు వెస్ట్ జోన్‌తో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్. 10లో పదుల సంఖ్యలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా వాణిజ్య భవనాలు ఉండడం గమనార్హం. గ్రేటర్లో పలు ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య వ్యాపార భవనాల నిర్మాణ పనులు పూర్తవకుండానే బడా బాబులు లీజులకు ఇస్తూ నిబంధనలను తుంగలో తొకుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీజ్ చేసిన షాపింగ్ మాల్ ఇందుకు ఉదాహరణ.
గత ఆగస్టులో నిబంధనలు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. సదరు భవనంలో ఇప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టకుండానే, భవన నిర్మాణం పూర్తి కాకుండానే, వస్త్రాలయాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకోగా జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ పనులు పూర్తిగా కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వలేమని తిరసరించారు. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే షాపింగ్‌మాల్ ప్రారంభించారు. ఇదేతరహాలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో బడాబాబులు ఆక్యుపెన్సీ తెలిసి సర్టిఫికెట్ లేకుండానే వ్యాపారాలను ప్రారంభిస్తున్న టౌన్‌ప్లానింగ్ పట్టడం లేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో, లేదా భవనం ఎత్తు 7 మీటర్లు ( గ్రౌండ్ ప్లస్ వన్) కంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణంలో 10 శాతం విస్తీర్ణం మినహాయింపు పద్ధతిలో సంబంధిత భవన నిర్మాణ యజమాని జీహెచ్ఎంసీకి మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది.
నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని నియమాలను పరిశీలించి మంజూరైన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితే సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. కమిషనర్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. జోనల్ అనుమతులు అయితే జోనల్ కమిషనర్, సర్కిల్లో అయితే డిప్యూటీ కమిషనర్ ఓసీ జారీ చేస్తారు.
క్లాసిక్ ఫంక్షన్ హాల్ సీజ్
కార్వాన్: మొఘల్ కా నాలా ప్రధాన రోడ్డు పీవీఎన్ఆర్ బ్రిడ్జి పిల్లర్ నంబర్ 104 వద్ద ఉన్న క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను కోర్టు ఆదేశాలతో బుధవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భైరి రాజు మాట్లాడుతూ క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున డీజే ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులకు సమస్యలు వస్తున్నాయి. పోలీసులు అనేకసార్లు హెచ్చరించినప్పటికీ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
ఇదే క్రమంలో ఈ నెల 3, 4 వతేదీల్లో శుభకార్యాలు జరిగాయి. అయితే రాత్రి 12.30 దాటినా.. డీజే సౌండ్ పెద్ద ఎత్తున మోగించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వెళ్లి డీజే సౌండ్ ఆపాలని సూచించినప్పటికీ నిర్వాహకులు పట్టించులేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నివేదికను హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమర్పించగా, ఆమె జారీ చేసిన ఆదేశాల మేరకు కోర్టు సిబ్బందితో కలిసి ఇన్స్పెక్టర్ రాజు ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేశారు