సిటీబ్యూరో: వర్షాలు పడుతున్న వేళ.. వచ్చే మూడు నెలల పాటు గ్రేటర్లో సెల్లార్ తవ్వకాలపై జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. నిర్మాణాలు జరుపుతున్న బిల్డర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. యథేచ్ఛగా సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నాయి. హయత్‌నగర్ మండల రెవెన్యూ పరిధిలోని బాగ్ హయత్ నగర్, ఆర్టీసీ సూపర్ వైజర్ కాలనీకి ఆనుకొని దాదాపు 2500 గజాల విస్తీర్ణంలో సదరు యజమాని యథేచ్ఛగా సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నారు.
రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా తమ ఇష్టానుసారంగా పనులను చేపడుతున్నారు. కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌కు పట్టడం లేదు. కనీసం సెల్లార్ తవ్వకాలపై పర్యవేక్షణ జరపడం లేదు. వాస్తవంగా వర్షాకాలం వేళ రక్షణ గోడలు కడుతూ అవసరమైతే అధికారుల అనుమతితో సెల్లార్ పనులు చేపట్టాలి. కచ్చితంగా సైట్ ఇంజినీర్ పర్యవేక్షణ, జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ నిబంధనలకు చాలా మంది నిర్మాణదారులు నీళ్లొదిలారు. జేబీసీలు పెట్టి అడ్డగోలుగా తవ్వుకుంటూ వెళ్తున్నారు.
ప్రధానంగా జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందిన నిర్మాణదారు ప్రతి ఒక్కరూ తమ తమ భవన నిర్మాణాల వద్ద అనుమతి పొందిన ప్లాన్ (సాంక్షన్ ప్లాన్) డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక అక్రమ నిర్మాణం కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని లెక్కగట్టి, భవన యజమానుల నుంచే వసూలు చేసే చర్యలు చేపడుతారు. మళ్లీ మళ్లీ అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి భూమి విలువలో 25 శాతం పెనాల్టీ విధించే హక్కు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు ఉంటుంది. ఉల్లంఘనులను మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కఠిన నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
బండ్లగూడ: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ భవన నిర్మాణదారుడు భారీ సెల్లారు తవ్వుతుండగా కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలను చేపట్టడం ద్వారా అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రభుత్వం వర్షాకాలంలో సెల్లార్లు తీయవద్దని నిబంధనలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ నుంచి బండ్లగూడ చౌరస్తా వరకు ఉన్న రోడ్డును ఆనుకొని ఇరువైపులా సెల్లార్ల తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి.