బంజారాహిల్స్, మే 13: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భారీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. పదిరోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో ‘నిబంధనలకు ఉరి- నోటీసులతో సరి’ పేరుతో వచ్చిన కథనాలపై ఎట్టకేలకు స్పందించిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని కమలాపురి కాలనీ ఫేజ్-3 కిందకు వచ్చే ఇందిరానగర్ బస్తీ ప్రధాన రహదారిపై నర్సింగ్ యాదవ్ అనే వ్యాపారి భారీ వాణిజ్య నిర్మాణం చేపట్టారు. సుమారు 600 గజాల స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సెల్లార్‌తో పాటు 6 అంతస్థుల భవనం నిర్మిస్తున్న వ్యవహారంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బస్తీకి వెళ్లే ప్రధాన రహదారిపై కమర్షియల్ బిల్డింగ్‌కు కనీస సెట్బ్యాక్లు ఇవ్వడం లేదని, భవనానికి రెండు వైపులా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే భారీ నష్టం తప్పదని గుర్తించారు.
జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల సహకారంతోనే భారీ భవనం నిర్మించారని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్పందించిన జీహెచ్ఎంసీ సర్కిల్-18 డిప్యుటీ మున్సిపల్ కమిషనర్ సదరు నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయరాదో వారం రోజుల్లోగా జవాబు ఇవ్వాలని షోకాజ్ నోటీసులో కోరారు. ఈ విషయమై విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు డీఎంసీ సమ్మయ్య తెలిపారు. ఈ భవనంతో పాటు జవహర్‌నగర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 2కు వెళ్లే లింక్ రోడ్డుపై 300 గజాల స్థలంలో రవీందర్ యాదవ్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా 5 ఫ్లోర్ల కమర్షియల్ బిల్డింగ్ వ్యవహారంలో సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.