సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకం నిర్వహణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నది. రహదారులపై గుంతలు ఏర్పడుతున్న ఏజెన్సీలపై పర్యవేక్షణ లేకపోగా, కనీసం జరిమానా విధింపు పట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సదరు ఏజెన్సీల గడువు ముగియగా, రెన్యూవల్ చేయలేదని, దీంతోనే నిర్వహణ గాడి తప్పిందన్న విమర్శలు లేకపోలేదు. ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. కాగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గుంతలు లేని రహదారుల లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి, తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020వ సంవత్సరంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
దాదాపు రూ.1050 కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఆర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ రూ. 696.71 కోట్ల ప్రతిపాదనలను పక్కన పెట్టడం, కనీసం మొదటి దశ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహణ చేపట్టకపోవడం గమనార్హం.