GHMC Mayor | సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, హెల్త్, వెటర్నరీ విభాగాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సిబ్బందిని ఏ సమయానికి వస్తున్నారు? సమయ పాలన పాటిస్తున్నారా అంటూ అడిగారు. కొన్ని సెక్షన్లలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో ఇంకా ఆఫీస్‌కు రాలేదా అంటూ.. పక్క సీట్లో ఉన్న వారిని అడుగ్గా, టిఫిన్ చేయడానికి వెళ్లారు అనడంతో సమయ పాలన పాటించాలన్నారు.
అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి.. ఆలస్యం వచ్చిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక పంపాలని అన్ని విభాగాలకు సర్క్యూలర్ పంపించారు. కాగా, హెల్త్ సెక్షన్లో కొందరు పని పకన పెట్టి సెల్ ఫోన్ చూస్తుండడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి సీఎంఅండ్హెచ్ఓ ఏ సమయానికి వస్తున్నారని.. సిబ్బందిని అడగడంతో జేసీ శానిటేషన్ జోక్యం చేసుకొని ముషీరాబాద్ సరిల్లో ఏఎంఅండ్హెచ్ఓగా పని చేస్తున్నందున అకడ పని పూర్తి చేసుకొని మధ్యాహ్నం వరకు ఇకడకు వస్తున్నారని మేయర్‌కు తెలిపారు.
రావడానికి ఒక సమయం అంటూ లేదా అని ప్రశ్నించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు హెడ్ ఆఫీసుకు వస్తారని జేసీ వేణుగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా, ఆయా విభాగాల సిబ్బంది ఉదయం 10:30 వరకు రావాలని, గ్రేస్ టైం మరో 10 నిమిషాలు ఉంటుందని, 10:40 నిమిషాల వరకు ఆఫీస్‌కు రాని సిబ్బందికి ఒక మాసంలో మూడు లేట్లకు ఒక క్యాజువల్ లీవ్ కట్ చేస్తామన్నారు. క్యాజువల్ లీవ్ లేనటె్లైతే ఈఎల్ కట్ చేస్తామన్నారు. కాగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ హాజరు ప్రక్రియలో నమోదు కావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో ఆకస్మిక తనిఖీల అనంతరం విభాగాల అదనపు కమిషనర్లు, హెచ్ఓడీలతో సమీక్ష జరిపారు.